ESIC New Rules 2026 : ఈఎస్ఐ నిబంధనల్లో భారీ మార్పులు.. ఉద్యోగులకు ఇక నేరుగా ఖాతాలోకే డబ్బులు!
ESIC New Rules 2026 : ఈఎస్ఐ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. 2026 కొత్త నిబంధనలతో అనారోగ్య, ప్రసూతి, ప్రమాద పరిహారం క్లెయిమ్స్ ఈజీ కానున్నాయి. పేపర్ వర్క్ లేకుండానే నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు పొందవచ్చు..
- Sreehari A
- Updated on- November 22, 2026 / 09:18 PM IST
ESIC New Rules 2026
- ఉద్యోగులకు కేంద్రం తీపికబురు..
- ఈఎస్ఐలో కొత్త రూల్స్ వచ్చేశాయ్..
- పేపర్ వర్క్ లేకుండానే ప్రయోజనాలు
ESIC New Rules 2026 : ఉద్యోగులకు ఈఎస్ఐ (ESI) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అనారోగ్యం వచ్చినా, ప్రసూతి సమయం వచ్చినా, పనిచేసే చోట ప్రమాదం జరిగినా.. ఇకపై క్లెయిమ్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
క్లెయిమ్ ప్రక్రియను మరింత ఈజీ చేస్తూ ఉద్యోగుల బీమా సంస్థ (ESIC) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సామాజిక భద్రత కోడ్-2020కి అనుగుణంగా 1950 నాటి పాత నిబంధనల స్థానంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్-2026ను నోటిఫై చేసింది..
ఇక ఆటోమేటిక్‌గా డబ్బులు జమ :
కొత్త నిబంధనల ప్రకారం అనారోగ్య, ప్రసూతి ప్రయోజనాల క్లెయిమ్స్ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతాయి. దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు. ఈఎస్ఐ పోర్టల్ ద్వారా మెడికల్ సర్టిఫికెట్ జారీ కావాలి. యజమాని నెలవారీ రిటర్న్ సమర్పించాలి. ఉద్యోగి బీమా నంబర్, బ్యాంకు ఖాతా ఆధార్‌తో అనుసంధానమై ఉంటే డబ్బులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి.
ప్రమాదం జరిగినా త్వరగా పరిహారం :
పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగి తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యం కలిగినా, మరణం సంభవించినా క్లెయిమ్ ప్రక్రియ సులభం కానుంది. యజమాని ఆన్లైన్లో ప్రమాద వివరాలు నమోదు చేస్తే చాలు. తొలి చెల్లింపు కోసం కుటుంబ సభ్యులు విడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే ఉద్యోగులు కూడా నేరుగా క్లెయిమ్ చేసుకోవచ్చు.
Read Also : CIBIL Score : 750కి పైగా క్రెడిట్ స్కోర్ కావాలంటే.. ఈ 5 అలవాట్లు ఇప్పుడే మార్చుకోండి..!
మహిళా ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు :
ప్రసూతి సమయంలో మహిళలకు 100 శాతం సగటు రోజువారీ వేతనంతో సెలవులు లభిస్తాయి. ఇద్దరు పిల్లల వరకు 26 వారాలు, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా, దత్తత తీసుకున్నా 12 వారాల వేతన ప్రయోజనం ఉంటుంది. ప్రసూతి క్లెయిమ్ ముందస్తు గడువును 50 నుంచి 56 రోజులకు పెంచారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న మహిళలకు ఇది 42 రోజులుగా ఉంటుంది.
అనారోగ్య ప్రయోజనాలు 7 రోజుల్లో, ప్రసూతి ప్రయోజనాల తొలి వాయిదా 14 రోజుల్లో చెల్లించాలనే నిబంధన కొనసాగుతుంది. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థల్లో, నెలకు రూ.21 వేల లోపు వేతనం పొందేవారు ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు.
దివ్యాంగులకు ఈ పరిమితి రూ.25 వేలు. ఈ మార్పులతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. అయితే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీని ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ నిర్ణయించనున్నారు.
