EPFO Update : ఉద్యోగం మానేశారా? మీ PF డబ్బుపై వడ్డీ ఎప్పటి వరకు వస్తుందో తెలుసా?
EPFO Update : ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ ఖాతాకు ఎంతకాలం వడ్డీ వస్తుంది? 55, 58 ఏళ్ల వయస్సు, 36 నెలల నిబంధన, ఇన్‌యాక్టివ్ అకౌంట్, పీఎఫ్ విత్‌డ్రా ఫారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
EPFO Update
- మూడేళ్లు డబ్బులు జమ కాకపోయినా వడ్డీ వస్తుందా?
- వడ్డీ విషయంలో ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
- పాత పీఎఫ్ ఖాతాలో డబ్బులు ఉన్నాయా?
EPFO Update : ఉద్యోగం మారినా.. ఉద్యోగం మానేసినా చెప్పినా.. మీ పీఎఫ్ అకౌంట్‌ను మాత్రం మర్చిపోకండి.. చాలామందికి ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ కావడం ఆగిపోతే వడ్డీ కూడా నిలిచిపోతుందని ఓ సందేహం ఉంటుంది.
ముఖ్యంగా మూడేళ్ల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకపోతే పీఎఫ్ అకౌంట్‌పై వడ్డీ రాదని భావిస్తుంటారు.. కానీ, ఈపీఎఫ్ఓ నిబంధనలు అందరికీ ఒకేలా ఉండవు. మరి అసలు రూల్స్ ఏంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
58 ఏళ్ల వరకు వడ్డీ వచ్చే అవకాశం :
ఉద్యోగి 55 ఏళ్లలోపు ఉద్యోగం మానేస్తే.. కొత్తగా పీఎఫ్ డబ్బులు జమ కాకపోయినా 58 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పాత ఖాతాలోని బ్యాలెన్స్ పై వడ్డీ వస్తుంది. అదే 55 ఏళ్లు లేదా ఆ తర్వాత రిటైర్ అయిన వారికి చివరి కాంట్రిబ్యూషన్ నుంచి 36 నెలల నిబంధన వర్తిస్తుంది. ఉదాహరణకు.. 58 ఏళ్లకు రిటైర్ అయిన వ్యక్తికి మరో మూడేళ్ల వరకు వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also : iQOO 15R Price Drop : రూ. 77,999 ఫోన్ ఇప్పుడు రూ. 59,999కే.. ఐక్యూ 15Rపై అమెజాన్ అదిరిపోయే ఆఫర్..
ఈ పరిస్థితుల్లో ఖాతా ఇన్‌యాక్టివ్ :
55 ఏళ్లు లేదా ఆపై రిటైర్మెంట్ తర్వాత 36 నెలలు డబ్బులు తీసుకోకపోవడం, శాశ్వతంగా విదేశాలకు వెళ్లిన తర్వాత మూడేళ్లపాటు ఎలాంటి లావాదేవీలు లేకపోవడం, ఖాతాదారు మరణించిన తర్వాత 36 నెలల్లో క్లెయిమ్ చేయకపోవడం వంటి సందర్భాల్లో ఖాతా ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది. బ్యాంక్ ఖాతా తప్పుగా ఉండి సెటిల్మెంట్ డబ్బులు వెనక్కి వచ్చినా ఇదే నిబంధన వర్తిస్తుంది..
పాత పీఎఫ్ డబ్బులు ఎలా తీసుకోవాలి? :
ఖాతా ఇన్‌యాక్టివ్ అయినంత మాత్రాన మీ డబ్బులు పోయినట్లు కాదు.. అవసరమైన వెరిఫికేషన్ తర్వాత వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. పూర్తి పీఎఫ్ విత్‌డ్రా కోసం ఫారం 19, మరో ఖాతాకు బదిలీ చేసేందుకు ఫారం 13, మరణించిన సభ్యుడి డబ్బుల కోసం నామినీ ఫారం 20 వాడాలి.
ముందుగా యూఏఎన్ యాక్టివ్‌గా ఉందో లేదో చూసుకుని ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలతో కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. అవసరమైతే ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీస్‌ను సంప్రదించవచ్చు. పాత పీఎఫ్ ఖాతాలో డబ్బులున్నాయంటే నిర్లక్ష్యం చేయకండి. మీకు రావాల్సిన సొమ్మును నిబంధనల ప్రకారం క్లెయిమ్ చేసుకోండి..
