Stock Market Crash : దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజులో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!
Stock Market Crash : స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం నమోదైంది. సెన్సెక్స్ 1,483 పాయింట్లు, నిఫ్టీ 450 పాయింట్లు పడిపోయాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరైంది. మార్కెట్లు పడిపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకోండి..
- Sreehari A
- Published on- November 23, 2026 / 04:26 PM IST
Stock Market Crash
- ఒక్కసారిగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్..
- లాభాల్లో మొదలై నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 1500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
Stock Market Crash : స్టాక్ మార్కెట్‌లో ఒక్కరోజులోనే భారీ కుదుపు కనిపించింది. ఉదయం మంచి జోష్‌తో లాభాల్లో మొదలైన దేశీయ మార్కెట్లు.. చూస్తుండగానే నష్టాల బాట పట్టాయి. బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తగా సూచీలు భారీగా పతనమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఏకంగా 1,483.72 పాయింట్లు పడిపోయి 82,435.99 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 450.95 పాయింట్లు నష్టపోయి 25,349.65 స్థాయికి చేరింది. మార్కెట్ల పతనంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లు తగ్గిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీ మొత్తంలో ఆవిరైంది..
Read Also : Gold Silver Prices Today : బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఒక్కరోజులోనే భారీ మార్పులు.. నేటి ధరలు ఇవే..
మార్కెట్లు పతనానికి కారణాలేంటి? :
వాస్తవానికి, ఇటీవల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మంచి లాభాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో చాలామంది ఇన్వెస్టర్లు తమకు వచ్చిన లాభాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే ప్రాఫిట్ బుకింగ్ రూపంలో అమ్మకాల ఒత్తిడిని పెంచింది. ముఖ్యంగా భారీ వెయిటేజీ ఉన్న బ్యాంకింగ్ షేర్లు పడిపోవడంతో మార్కెట్లపై ప్రభావం మరింత ఎక్కువైంది.
మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో తీసుకోబోయే నిర్ణయాలపై కూడా మార్కెట్లలో ఆందోళన నెలకొంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే విదేశీ పెట్టుబడులు భారత్ నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉందనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి.
ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92.91కి చేరడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో ఆందోళనలు పెరిగాయి. వరుస లాభాల తర్వాత వచ్చిన ఈ భారీ పతనం మార్కెట్‌లో కొత్త చర్చకు తెరలేపింది.
