Annual Local Toll Pass : రూ.1,500కే ఏడాది లోకల్ టోల్ పాస్.. నెలనెలా కట్టనక్కర్లేదు.. అర్హతలు, ఎలా అప్లయ్ చేయాలంటే?

Annual Local Toll Pass : టోల్ ప్లాజా సమీపంలో నివసించే వాహనదారులకు గుడ్‌న్యూస్. కేవలం రూ.1,500కే ఏడాది లోకల్ టోల్ పాస్ పొందవచ్చు. అర్హతలు, దరఖాస్తు విధానం, ఆదా వివరాలు తెలుసుకోండి.

Annual Local Toll Pass

  • టోల్ ప్లాజా దగ్గర ఉంటున్నారా?
  • నెలనెలా డబ్బులు కట్టే పని లేదు
  • రూ.1,500కే ఏడాది పాస్ తీసుకోవచ్చు

Annual Local Toll Pass : టోల్ ప్లాజా దాటాలంటే ప్రతిసారీ డబ్బులు కట్టాలి.. లేదంటే నెలనెలా లోకల్ పాస్ రెన్యూవల్ చేసుకోవాలి. ఇదే పనిగా మారిందా? అయితే, అలాంటి వాహనదారులకు నిజంగానే ఇది మంచి వార్త.

టోల్ ప్లాజాల సమీపంలో నివసించే స్థానిక ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే వెసులుబాటు కల్పించింది. ఇకపై నెలవారీ పాస్‌ల కోసం పదేపదే డబ్బులు చెల్లించే అవసరం లేకుండా ఏడాది మొత్తానికి ఒకేసారి లోకల్ పాస్ తీసుకునే అవకాశం కల్పించింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏడాదికి రూ.2,820 వరకు ఆదా :
ఇప్పటివరకు స్థానిక వాహనదారులు నెలవారీ లోకల్ పాస్ కోసం రూ.360 చెల్లించేవారు. అంటే ఏడాదికి మొత్తం రూ.4,320 ఖర్చయ్యేది. కానీ, కొత్త వార్షిక పాస్ విధానంలో కేవలం రూ.1,500 చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ఏడాదికి ఏకంగా రూ.2,820 వరకు ఆదా చేసుకోవచ్చు. నవంబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది..

Read Also : Hyderabad to Karimnagar Train : హైదరాబాద్‌ టు కరీంనగర్‌.. గంటల్లోనే ప్రయాణం! కొత్త హైస్పీడ్ రైలు రూట్ ఇదే..?

ఎవరికి ఈ అవకాశం అంటే? :
టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానికులకు ఈ పాస్ వర్తిస్తుంది. అయితే, ఇది వ్యక్తిగత కార్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు ఈ సదుపాయం ఉండదు. స్థానికంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ప్రతిరోజూ కార్లపై ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

యాప్‌లోనే పాస్ పొందొచ్చు :
ఈ పాస్ కోసం టోల్ ప్లాజా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రాజ్‌మార్గ్‌యాత్ర (Rajmargyatra) యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే అప్లయ్ చేసుకోవచ్చు. అడ్రస్, ఫాస్టాగ్ వివరాలు రిజిస్టర్ చేస్తే జీపీఎస్ ఆధారిత ప్రాంత పరిశీలన ద్వారా అర్హతను నిర్ధారిస్తారు. కారు ఆర్‌సీ, ఆధార్, ఓటర్ కార్డుల్లో అడ్రస్ ఒకేలా ఉండాలి.

ముఖ్యంగా నెలవారీ పాస్ తీసుకునేవారు నెల మొదటి తేదీనే రెన్యూవల్ చేసుకోవడం బెటర్.. ఎందుకంటే నెల మధ్యలో తీసుకున్నా ఆ నెల చివరి వరకే పనిచేస్తుంది. అదే వార్షిక పాస్ తీసుకుంటే ఏడాది పాటు నిశ్చింతగా ప్రయాణించవచ్చు. అర్హత ఉన్న స్థానిక వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు..