Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల బుకింగ్ తేదీలు విడుదల

Tirumala : ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టికెట్లు, దర్శన టోకెన్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది.

Tirumala Vaikuntha Dwara Darshanam tickets Booking dates released

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టికెట్లు, దర్శన టోకెన్ల విడుదల తేదీలను ప్రకటించింది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. ఈ నేపథ్యంలో శ్రీవాణి టికెట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల విడుదల షెడ్యూల్‌ను వెల్లడించింది.

Also Read : Women Reservation Bill : మళ్లీ పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది..! ఎన్డీయే బలం ఎంత పెరిగింది?

ఏ రోజు ఏ టికెట్లు విడుదల చేస్తారంటే?
♦ నవంబర్ 28: ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.
♦ నవంబర్ 30: ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
♦ డిసెంబర్ 1 నుంచి 5 వరకు : ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజుల దర్శనాల కోసం స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్ల కోసం ఈ-డిప్‌ (E-Dip) రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
♦ డిసెంబర్ 7వ తేదీ : మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కేటాయింపు జరుగుతుంది.
♦ డిసెంబర్ 8: ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్లు విడుదల చేస్తారు.

డిసెంబర్ 20, 21 తేదీల్లో రూ.300 టికెట్లు రద్దు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో సాధారణ భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అదేవిధంగా డిసెంబర్ 20, 21 తేదీలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేసింది. ఈ రెండు రోజుల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయించనున్నారు.

ఈ-డిప్‌లో టోకెన్లు0 ఎలా కేటాయిస్తారు?
డిసెంబర్ 20, 21 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఈ-డిప్ కోసం నమోదు చేసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత డిసెంబర్ 7న మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ విధానంలో టోకెన్లు కేటాయిస్తారు. టోకెన్లు పొందిన భక్తులకు కేటాయించిన సమయానికి తిరుమలలో దర్శనానికి అవకాశం కల్పిస్తారు.

అధికారిక వెబ్‌సైట్‌లోనే టికెట్లు బుక్ చేసుకోండి..
భక్తులు దర్శన టికెట్లు, టోకెన్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలి. దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ అధికారులు సూచించారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్: https://ttdevasthanams.ap.gov.in వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు టికెట్ల విడుదల తేదీలు, సమయాలను ముందుగానే గుర్తుంచుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ప్రతియేటా తిరుమల వైకుంఠ ద్వారా దర్శనాలకోసం భక్తులు భారీగా తరలివస్తుంటారు. అయితే, గతేడాది వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్లను తిరుపతిలోని కౌంటర్లలో జారీచేశారు.. కానీ ఆ ఏడాది ఈ టికెట్ల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత టీటీడీ తిరుపతిలో టోకెన్లు జారీని నిలిపివేసింది. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తోంది.