TTD Gold : తిరుమల శ్రీవారిని ప్రతినిత్యం ఎన్నిరకాల స్వర్ణాభరణాలతో అలంకరిస్తారో తెలుసా..? వాటి బరువు.. విలువ ఎంతంటే? పూర్తి వివరాలు ఇవే..
TTD Gold Reserves : శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాలంకరణకు 40 రకాల ఆభరణాలు ఉపయోగిస్తారు. నిత్యకట్ల ఆభరణాలతో పాటు.. పర్వదినాల్లో రత్న ఖచిత, వజ్ర వైడూర్యాలు పొదిగిన విశేష నగలను అలంకరిస్తారు.
- Harish Thanniru
- Updated on- November 26, 2026 / 10:32 AM IST
TTD Gold Reserves
TTD Gold Reserves : తిరుమల.. ఇది కలియుగ వైకుంఠం. అనాధ రక్షకుడిగా, ఆర్తజన దీక్షాదక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా.. అన్నింటికీమించి గోవిందుడిలా ఆ వేంకటేశ్వరుని కొలిచే భక్తులు.. ఏడుకొండలకు భారీగా వస్తుంటారు. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల నుంచి స్వామి వారిని క్షణకాలంపాటు చూసుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు. అంతేకాదు.. తమవంతుగా కానుకలు ఇస్తుంటారు. అయితే, ఓ అజ్ఞాత భక్తుడు తిరుమల స్వామివారికి ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను భారీ విరాళంగా సమర్పించేందుకు సిద్ధమయ్యారు. మార్కెట్లో వీటి విలువ సుమారు 160 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఒక భక్తుడు ఇంత పెద్ద మొత్తంలో బంగారు నగలను కానుకగా ఇవ్వడం ఇదే మొదటిసారి.
అజ్ఞాత భక్తుడు విరాళంతో ఇప్పుడు కొత్త చర్చ..
తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడి భారీ విరాళంతో.. ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. టీటీడీ దగ్గర మొత్తం ఎంత బంగారం ఉంది.. భూములు, భవనాలు ఎన్ని.. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం ఆస్తుల విలువ ఎంత ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. స్వామివారిని ఒక్కోరోజు ఒక్కోలా అలంకరిస్తారు. వాటి ప్రత్యేకతలు ఏంటి.. ఏ రోజు ఎలాంటి ఆభరణాల్లో స్వామివారు దర్శనం ఇస్తారనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
శ్రీవారి నిత్యాలంకరణకు 40 రకాల ఆభరణాలు ఇవే..
శ్రీవేంకటేశ్వరస్వామి.. నిత్య అలంకార ప్రియుడు. రాజులకాలం నుంచి నేటి వరకు భక్తుల కానుకలతో శ్రీవారి స్వర్ణ వైభవం దినదినాభివృద్ధి చెందుతోంది. శ్రీవారి నిత్యాలంకరణకు 40 రకాల ఆభరణాలు ఉపయోగిస్తారు. నిత్యకట్ల ఆభరణాలతో పాటు.. పర్వదినాల్లో రత్న ఖచిత, వజ్ర వైడూర్యాలు పొదిగిన విశేష నగలను అలంకరిస్తారు. ప్రతివారం జరిగే అభిషేకం తర్వాత సహస్ర నామాల మాల, పచ్చలు పొదిగిన కంఠాభరణం, వక్షస్థల లక్ష్మి, లక్ష్మీహారాలు ఎల్లప్పుడూ మూలమూర్తికి అలంకరిస్తారు. ఇవి కాకుండా మరో 3 జతల ఆభరణాలను అలంకారానికి తగ్గట్లుగా మారుస్తూ ఉంటారు.
4వందల రకాలకుపైగా నగలు..
మూలమూర్తి అలంకరణకు 150 రకాలకు పైగా ఆభరణాలను.. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి 4వందల రకాలకుపైగా నగలను వాడుతున్నారు. స్వామి వారి దగ్గర 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటిలో వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం, ఆకాశరాజు కిరీటాలు ముఖ్యమైనవి. సువర్ణ పద్మపీఠం, పాదాలు, ఉదరబంధం, పులిగోరు, యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, దశావతార హారం, 4 కిలోల చతుర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్య కటారి, కటి వరద హస్తాలు, నాగాభరణాలు, భుజకీర్తులు తదితర అపురూప ఆభరణాలు స్వామివారి అలంకరణలో భాగం అవుతున్నాయి.
ఏ రోజు ఏ అభరణాల్లో స్వామి దర్శనం ఇస్తారు ?
అభిషేక ఉత్సవ సమయంలో బంగారు పాత్రలను ఉపయోగిస్తారు. ఉత్సవ సమయాల్లో రత్నకిరీటం, మేరు పచ్చ, రత్నాలతో చేసిన శంఖుచక్రాలు, రత్నాల కర్ణపత్రాలు, రత్నాల కటి వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్త్రాలతో మలయప్ప స్వామిని ముస్తాబు చేస్తారు. ఇక ప్రతీ గురువారం శ్రీవారికి ప్రధాన ఆభరణాలు తీసేసి.. ధోవతి, ఉత్తరీయం ధరింపజేస్తారు. తిరునామం సన్నగా దిద్దుతారు. ఈ సమయంలో నేత్ర దర్శనం స్పష్టంగా ఉంటుంది. ఈ సమయంలో సువర్ణ పాదాలు, హస్తాలు, శంఖు చక్రాలు, సాలగ్రామ హారాలు మాత్రమే ఉంటాయి. అదే రోజు పూలంగి సేవలో భాగంగా పూలమాలలతో అలంకరిస్తారు. ఇక ప్రతీ శుక్రవారం శ్రీవారికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ సమయంలో పసుపు, చందనం, ఇతర సుగంధ ద్రవ్యాలతో అలంకరిస్తారు. అభిషేకం పూర్తయ్యాక స్వర్ణ ఆభరణాలు, వజ్ర కిరీటంతో స్వామివారు దర్శనమిస్తారు. ఆదివారం.. సూర్యభగవానుడిని పూజించే రోజు. దీంతో సూర్య కిరణాలను సూచించే ప్రత్యేక ఆభరణాలతో స్వామివారిని అలంకరిస్తారు.
ప్రత్యేక రోజుల్లో స్వామి వారు ధరించే ఆభరణాలేంటి ?
బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజులు విభిన్న రీతిలో అలంకరిస్తారు. బంగారు ఆభరణాలు, వజ్ర కిరీటం, రత్న ఖచిత హారాలతో సహా వివిధ ఆభరణాలతో అలంకరిస్తారు. ఉగాది, దీపావళి, వైకుంఠ ఏకాదశి సమయంలో ప్రత్యేక ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలతో అలంకరణలు చేస్తారు. పండుగ రోజుల్లో పలు ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు.
అసలు టీటీడీ దగ్గర ఉన్న బంగారం ఎంత ?
1933లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి.. భక్తులు అత్యంత విలువైన బంగారు ఆభరణాలు తయారు చేయించి స్వామివారికి విరాళంగా ఇచ్చారు. టీటీడీకి భక్తులు హుండీ ద్వారానే కాకుండా అన్నప్రసాదం, ప్రాణదాన, బర్డ్, గోసంరక్షణలాంటి ట్రస్టులకు భారీగా విరాళాలు అందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం టీటీడీ దగ్గర 11వేల 3వందల కిలోలకు పైగా బంగారం, 10 టన్నుల వెండి నిల్వలు.. అలాగే 19 వేల కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయ్. సగటున ప్రతి నెలా హుండీ ద్వారా 100 కోట్ల నుంచి 130 కోట్ల రూపాయల నగదు, 100 కిలోలకు పైగా బంగారం శ్రీవారికి కానుకలుగా అందుతోంది. టీటీడీ ఆస్తుల విలువ 5లక్షల కోట్ల రూపాయలు వరకు ఉంటుందని అంచనా. స్వామివారి అలంకరణకు 10వేల కోట్ల విలువ చేసే 650 కేజీల ఆభరణాలు ఉపయోగిస్తారు. ఈ ఆభరణాలకు.. ప్రస్తుతం అజ్ఞాత భక్తుడు అందిస్తున్న 121 కిలోల బంగారు ఆభరణాలు తోడు కానున్నాయి.
