Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. టోల్‌ప్లాజా వద్ద ఆగిఉన్న కారును ఢీకొట్టిన లారీ.. ఓటు వేసేందుకు వెళ్తుండగా ఘటన

Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం పాలయ్యారు.

Road Accident

Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెంగళూరు నుంచి ఐదుగురు వ్యక్తులు కారులో సొంత గ్రామానికి వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్దకు‌రాగానే వేగంగా వచ్చిన లారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు. కారులో ఉన్న 15ఏళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.

Also Read : Nara Lokesh : కష్టపడిన వారికే గుర్తింపు.. నామినేటెడ్ పదవులపై లోకేశ్ కీలక హామీ!

ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చెరుకుంపాలేనికి చెందిన ఐదుగురు గ్రామస్థులు బెంగళూరు నుంచి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. స్థానిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారు వస్తున్నారు. ఈ క్రమంలో టంగుటూరు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న కారు.. టోల్‌ చెల్లించేందుకు అప్పటికే వేచి ఉన్న ట్రావెల్స్‌ బస్సు వెనుక ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు లారీ, బస్సు మధ్య చిక్కుకుని పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సోమేపల్లి సాయికుమార్, కోట కామేశ్వరమ్మ వీరితో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మహిళను ఒంగోలు రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. అయితే, కారులో ప్రయాణిస్తున్న 15 ఏళ్ల బాలుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పంచనామా నిమిత్తం మృతదేహాలను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.