JanaSena Party : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో జనసేన కీలక నిర్ణయం.. సీట్ల పంపకాలు ఉండవు.. ఎవరైనా పోటీ చేయొచ్చు..!

JanaSena Party : ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలపై జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.

JanaSena Party

JanaSena Party : ఏపీలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 19న నోటిఫికేషన్ విడుదల కాగా.. నవంబర్ 26, నవంబర్ 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది.

Also Read : Number Plate Fine : వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇలాచేస్తే ఇకనుంచి మీకు భారీ జరిమానా తప్పదు.. ఏఐతో నిఘా..

మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల వారిగా సీట్లు పంచుకొని ఆయా పార్టీల నేతలు బరిలోకిదిగి విజయం సాధించారు. అయితే, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ స్పష్టం చేసినట్లు ఆ పార్టీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది.

‘‘గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగేవి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను పార్టీ నాయకులు అడ్డుకోకూడదు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరపున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలి’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.