Ap Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్.. విపత్తుల సంస్థ కీలక హెచ్చరిక!
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు(Ap Rain Alert), పిడుగులు పడే సూచనలు ఉన్నాయి.
- V Santhosh Kumar
- Published on- November 28, 2026 / 08:54 AM IST
low pressure area bay of bengal depression forecast rain alert andhra pradesh
Ap Rain Alert: దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో వాతావరణ కదలికలు వేగవంతమవుతున్నాయి. ఈ నెల 30 నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ వ్యవస్థ క్రమంగా బలపడుతూ డిసెంబర్ 2 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. అయితే, వివిధ అంతర్జాతీయ వాతావరణ మోడల్స్ అంచనాల ప్రకారం ఈ వాయుగుండం తీరాన్ని తాకకముందే సముద్రంలోనే బలహీనపడే అవకాశాలు ఉన్నాయని విపత్తుల సంస్థ వెల్లడించింది. అయినప్పటికీ మత్స్యకారులు, తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. పిడుగుల ముప్పుపై హెచ్చరిక:
ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతంగా ఉండి వర్షాలు (Ap Rain Alert)కురుస్తున్నాయి. ముఖ్యంగా శనివారం నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఆకస్మిక వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
రాయలసీమ, కోస్తాలో వర్ష సూచన.. ప్రజలకు కీలక మార్గదర్శకాలు:
మరోవైపు మార్కాపురం, ప్రకాశం జిల్లాలు సహా మిగతా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు, బయట తిరిగే ప్రజలు వర్షాలు, పిడుగుల సమయంలో ఎత్తైన చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది.
