Nara Lokesh : ఐఐటీ అయినా.. ఐటీఐ అయినా గౌరవం ఒక్కటే.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
Nara Lokesh : ఐటీఐ విద్యార్థులకు కూడా ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమాన గౌరవం దక్కాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. వృత్తి విద్య, నైపుణ్య కార్మికుల ప్రాధాన్యత, ఏఐ యుగంలో స్కిల్ ఎడ్యుకేషన్ అవసరంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి..
- Sreehari A
- Published on- November 22, 2026 / 05:15 PM IST
Nara Lokesh
- ఐఐటీతో సమాన గౌరవం రావాల్సిందే
- ఐఐటీ అయినా.. ఐటీఐ అయినా గౌరవం ఒక్కటే
- ఐటీఐ విద్యార్థులకు లోకేశ్ మద్దతు
Nara Lokesh : చదువంటే కేవలం డిగ్రీలు, పెద్ద పెద్ద కాలేజీల్లో చదవడమేనా? చేతివృత్తులు నేర్చుకుని, తమ నైపుణ్యంతో బతుకుదెరువు సంపాదించేవారికి గౌరవం అక్కర్లేదా? ఇప్పటికీ చాలామందిలో ఉన్న ఈ ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఉందని ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఐటీఐ చదివిన విద్యార్థులకు కూడా ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానమైన గౌరవం, గుర్తింపు దక్కాలని ఆయన అభిప్రాయపడ్డారు..
వీరిని తక్కువగా చూడొద్దు.. :
ఈ రోజుల్లో చదువుకు ఉన్న విలువను మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాల ఆధారంగా కొలుస్తున్నారు. కానీ, ఒక ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ వంటి నైపుణ్యం ఉన్న వ్యక్తి సమాజానికి అందించే సేవ కూడా అంతే విలువైనది. ఇలాంటి వృత్తులను ఎంచుకున్నవారిని తక్కువగా చూడటం సరైన పద్ధతి కాదని లోకేశ్ పేర్కొన్నారు.
మోదీకి లోకేష్ ధన్యవాదాలు :
ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ఈ అంశాన్ని ప్రస్తావించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. జర్మనీ వంటి దేశాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు ఎంతో గౌరవం ఉంటుందని, అక్కడి పారిశ్రామిక అభివృద్ధికి అది కూడా ఒక ముఖ్యమైన కారణమని పేర్కొన్నారు. మన దగ్గర కూడా అలాంటి పరిస్థితి రావాలని ఆకాంక్షించారు.
Read Also : AP Rice Price Update : ఇక బియ్యం కొనాలంటే భయం వద్దు.. కిలో రూ.47 నుంచే.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు, పని విధానాలు మారుతున్నాయి. ఈ సమయంలో కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు యంత్రాలను నడపడం, మరమ్మతులు చేయడం, పరిశ్రమల్లో పనిచేయడం వంటి ఆచరణాత్మక నైపుణ్యాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. కేవలం పుస్తకాల్లో చదివిన జ్ఞానమే కాకుండా, చేతల్లో పని చేసి చూపించే సామర్థ్యం కూడా భవిష్యత్తులో ఎంతో కీలకం కానుంది.
అందుకే ఐటీఐ వంటి వృత్తి విద్యా కోర్సులను చిన్నచూపు చూడకుండా ప్రోత్సహించాలి. తాము ఎంచుకున్న పనిపై విద్యార్థులకు గర్వం కలిగించాలి. ఏ పని చేసినా నిజాయతీగా, నైపుణ్యంతో చేస్తే గౌరవం దక్కాలనే ఆలోచన సమాజంలో బలపడాలి. అప్పుడే చదువుకు నిజమైన విలువ, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తాయి.
