CM Chandrababu : ఏకగ్రీవ పంచాయతీలకు భారీ నజరానా.. చంద్రబాబు కొత్త ప్లాన్ ఇదే!

CM Chandrababu : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. జనాభా ఆధారంగా ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించే అంశంపై కీలక ప్రకటన చేశారు.

CM Chandrababu

  • పంచాయతీల్లో ఏకగ్రీవాలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
  • భారీ నజరానాలు ప్రకటించిన ప్రభుత్వం
  • ఏకగ్రీవ పంచాయతీలకు రూ.50 లక్షల వరకు బహుమతి

CM Chandrababu : గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను ఏకగ్రీవం చేసుకునేలా పార్టీ నేతలు, మంత్రులు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల్లో గెలుపు ఒక్కటే కాదు.. గ్రామాల అభివృద్ధి కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు జనాభా ఆధారంగా భారీ ప్రోత్సాహకాలు అందించే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు..

మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ :
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పురపాలక, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాన్ని రెండున్నరేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన గుర్తింపుగా అభివర్ణించారు. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారని అన్నారు.

Read Also : Nara Lokesh : ఐఐటీ అయినా.. ఐటీఐ అయినా గౌరవం ఒక్కటే.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

ఇదే సమయంలో రాబోయే పంచాయతీ ఎన్నికలపై కూడా నేతలకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఏకగ్రీవాల వల్ల గ్రామాల్లో అనవసరమైన పోటీలు, విభేదాలు తగ్గి అభివృద్ధిపై అందరూ దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని వివరించారు. అందుకే గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు.

జనాభా ఆధారంగా నిధులు :
ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహక నిధుల వివరాలను కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. 5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న వాటికి రూ.25 లక్షలు, 10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు అందించే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

నేతలకు దిశానిర్దేశం.. :
గతంలో రూ.5 లక్షలుగా ఉన్న కనీస ప్రోత్సాహకాన్ని రూ.15 లక్షలకు, గరిష్ఠ మొత్తాన్ని రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు పార్టీలో వ్యక్తిగత పంతాలు, ఈగోలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. గ్రామస్థాయిలో ఐక్యత పెంచుతూ అభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు..