AP Rice Price Update : ఇక బియ్యం కొనాలంటే భయం వద్దు.. కిలో రూ.47 నుంచే.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

AP Rice Price Update : ఏపీలో పెరుగుతున్న బియ్యం ధరలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. కిలో బియ్యం రూ.47 నుంచి రూ.82 వరకు ధరలు నిర్ణయించింది. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే నిత్యావసర సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది..

Andhra Pradesh Rice Prices

  • పెరిగిన బియ్యం ధరలకు చెక్..
  • కిలో బియ్యం రూ.47 నుంచి రూ.82 వరకు..
  • ఏపీ ప్రభుత్వం ఫిక్స్ చేసిన ధరలివే

AP Rice Price Update : బియ్యం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి కుటుంబ బడ్జెట్ తలకిందులవుతోంది.

ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఊరటనిచ్చే దిశగా కీలక చర్యలు చేపట్టింది. బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు గరిష్ట ధరలను నిర్ణయించింది. దీంతో ఇకపై నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువకు బియ్యం అమ్మితే వ్యాపారులు, మిల్లర్లపై చర్యలు తీసుకోనుంది..

Read Also : Chittoor Robbery : చిత్తూరులో సినీ ఫక్కీలో దారి దోపిడీ.. కారును వెంబడించి రూ.20 లక్షలు దోచుకున్న దుండగులు!

రూ.47 నుంచి రూ.82 వరకు :
బియ్యం రకాలను బట్టి కిలో ధరలను రూ.47 నుంచి రూ.82 వరకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎంటీయూ సాధారణ రకాల బియ్యం కిలో రూ.47గా, బీపీటీ 3291 (సోనా), బీపీటీ 5204 (సాంబ), కేఎన్ఎం రకాల ధర కిలో రూ.66గా ఖరారు చేసింది. అలాగే హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ రకాల బియ్యం కిలో రూ.76గా, జైశ్రీరామ్ రకం రూ.82గా నిర్ణయించింది. ఎంటీయూ రకం 26 కిలోల బస్తా ధరను రూ.1,222గా ప్రకటించింది..

ధరణి బ్రాండ్ పేరుతో విక్రయం :
మరోవైపు రాష్ట్ర ప్రజలకు మరింత తక్కువ ధరకే బియ్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ధరణి బ్రాండ్ పేరుతో 26 కిలోల బియ్యం బస్తాలను రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల్లో అందిస్తోంది. ఇందులో మొబైల్ వాహనాల ద్వారా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అంతేకాదు.. డిసెంబర్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా కిలో కందిపప్పు రూ.100కు, కిలో గోధుమ పిండి రూ.25కు, లీటర్ పామాయిల్ రూ.125కు అందించనుంది. రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయిస్తోంది. ఆధార్ కార్డుతో సబ్సిడీ ధరకు ఉల్లిపాయలు కొనుగోలు చేసుకోవచ్చు.