ఎన్నికల వేళ బీసీ జపం : వైఎస్ఆర్ కాంగ్రెస్ బీసీ గర్జన

Submitted on 17 February 2019
YSR Congress Eluru BC Simha Garjana

ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలోని పొలిటికల్ పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జయహో బీసీ పేరిట సభ నిర్వహించగా... బీసీలకు దగ్గరయ్యేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం బీసీ సింహగర్జన నిర్వహించబోతున్నారు. ఏలూరు వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు.


వివిధ సామాజీక వర్గాలను దగ్గర తీసే పనిలో పడ్డారు జగన్. ఆయన నిర్వహించిన పాదయాత్రలో కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అంతేకాదు..కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు జగన్. పార్టీకి దూరంగా ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకొనేందుకు అనుసరించిన మార్గాలను అన్వేషిస్తున్నారు. బీసీ కులాల‌కు చెందిన ముఖ్య నేతలు, మేధావులు, ఉద్యోగ‌, విద్యార్ధి సంఘాల నేత‌లతోనూ సమావేశాలు నిర్వహించారు. ఈ స‌మావేశాల్లో బీసీల సమస్యల పరిష్కారానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు సేక‌రించారు. 


ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బీసీ సింహ గర్జన పేరిట సభ నిర్వహించనున్నారు. మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు నిర్వహించే ఈ భారీ బ‌హిరంగ‌ స‌భ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఆ పార్టీ నేతలు. ఈ సభకు బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్యని ఆహ్వానించడం ద్వారా... ఆ సామాజిక వర్గానికి తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ఈ సభలో తాము అధికారంలోకి వస్తే బీసీలకు ఏమి చేస్తామో జగన్ వివరించనున్నారు. రాజకీయంగా అధిక ప్రాధాన్యత కల్పిస్తామనే అంశాన్ని బీసీల్లోకి తీసుకువెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని బీసీలకు కేటాయించాలని జగన్ నిర్ణయించారు. వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి కి ఆ అవకాశం ఇస్తున్నట్లు ఇప్పటికే స్పష్టంచేశారు. మరి.. బీసీ ఓటు బ్యాంకు కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

YSR
Congress
Eluru
BC Simha Garjana
Jagan
BC Diclaration
Padayatra
PrajaSankalpaYatra

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు