2గంటల వ్యవధిలో 2సార్లు.. యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం

Submitted on 28 February 2020
Woman raped by 3 in separate incidents within 2 hours in Navi Mumbai

నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి కాటేస్తున్నారు. ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. దేశవ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంతో నిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయి.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. రెండు గంటల వ్యవధిలో రెండు సార్లు 19ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. ముగ్గురు వ్యక్తులు ఆ యువతిని రేప్ చేశారు. ఫిబ్రవరి 19న నవీ ముంబైలో జరిగిన ఈ ఘోరం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకడు ఆటో డ్రైవర్.

నమ్మించి కాటేసిన ఆటోడ్రైవర్:
బాధితురాలు తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఘటక్ పోర్ సబ్ అర్బన్ రైల్వే స్టేషన్ కు వెళ్లింది. అయితే ట్రైన్ మిస్ కావడంతో.. కాసేపు అక్కడే ఉండి మరో ట్రైన్ ఎక్కింది. థానే జిల్లాలోని ముంబ్రా రైల్వే స్టేషన్ చేరింది. ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి అక్కడే నిద్రపోయింది. ఫిబ్రవరి 19న మరో ట్రైన్ ఎక్కి దివా స్టేషన్ చేరుకుంది. అక్కడ ఓ బిచ్చగత్తె సాయం కోరింది. తన ముక్కు పుడక అమ్మి పెట్టి డబ్బు ఇవ్వాలని అడిగింది. అయితే ఆ రాత్రికి పని కాలేదు. ముక్కు పుడకను అమ్మలేకపోయారు. ఆ తర్వాత ఇద్దరూ నడుచుకుంటూ రోడ్డు మీదకు వెళ్లారు. రాత్రి 8.30గంటల సమయంలో ఓ హోటల్ దగ్గర ఇద్దరూ ఆగారు. అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ ని పిలిచిన బిచ్చగత్తె.. యువతిని సమీపంలోని రైల్వే స్టేషన్ లో వదిలిపెట్టాలని కోరింది.

సాయం చేస్తామని అత్యాచారం:
సరే అని చెప్పి యువతిని ఆటో ఎక్కించుకున్న అతడు.. మహపే ప్రాంతంలోని నిర్మానుష్యమైన చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ పురాతన భవనంలోకి యువతిని బలవంతంగా తీసుకెళ్లాడు. ఆమెను భయపెట్టి అత్యాచారం చేశాడు. తన కోరిక తీరాక.. ఆటోడ్రైవర్.. యువతిని.. ఓ ఆలయం దగ్గర వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో షాక్ గురైన బాధితురాలు.. నిస్సహాయ స్థితిలో రోడ్డుపై నిలబడి ఉంది. సాయం కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్ పై వెళ్తూ కనిపించారు. యువతి వారిని సాయం కోరింది. దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ కి తీసుకెళ్లమని ప్రాథేయపడింది. సరేనని చెప్పి యువతిని స్కూటర్ ఎక్కించుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు.. గన్ సోలి ప్రాంతంలో ఓ నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరు యువతిపై అత్యాచారం చేశారు. దీంతో బాధితురాలు మరోసారి షాక్ కి గురైంది.

ఉరి తియ్యాలని డిమాండ్:
కాసేపటి తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లిన బాధితురాలు.. జరిగిన ఘోరాన్ని వారికి వివరించింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు గంటల వ్యవధిలో రెండు సార్లు ఓ యువతిని .. ముగ్గురు వ్యక్తులు రేప్ చేయడం స్థానికంగా సంచలనం రేపింది. ఆడపిల్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి కేసుల్లో నిందితులను వెంటనే ఉరి తియ్యాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Woman
raped
Three
separate
incidents
Navi Mumbai
cops
Police
Railway Station

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు