కన్నా లక్ష్మీనారాయణకు పదవీ గండం : ఈసారి ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఆయనేనా?

Submitted on 26 February 2020
who is next ap bjp chief

ఆయనకేమో వస్తుందనుకున్న కొనసాగింపు ఆర్డర్‌ అందలేదు. ఇంతలో మరో వ్యక్తి తనకున్న శక్తినంతా ఉపయోగించి ఆ పీఠం మీద కూర్చుందామని ప్లాన్స్‌ వేస్తున్నారు. ఈయనకు అంత సీను లేదని ఇప్పుడున్నాయన వర్గం అంటోంది. అలా అని ఈయన వెనుక ఉండి తతంగం నడిపిస్తున్న వారేమో సామాన్యులు కాదాయె. మొత్తం మీద ఏపీ కమలం పార్టీలో కొత్త రాజకీయం మొదలయ్యింది. 

పార్టీ అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారంతో డీలా:
ఏపీ బీజేపీలో రాజకీయం రసకందాయంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో నాలుగు సీట్లు గెలుచుకుంది. రెండో ఎన్నికలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. కొంతమంది టీడీపీ సీనియర్లు, ఇతర పార్టీల నేతల చేరికలతో ఇప్పుడిప్పుడే బలపడుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీ శ్రేణులంతా ఉత్సాహంతో తేలిపోతున్నారట. ఇంతలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ ప్రచారం జరుగుతుండడంతో కన్నా వర్గం డీలా పడిపోయింది. బీజేపీ నేత నేత విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఆశావహుల ఆశలు రెట్టింపయ్యాయి. 

మాధవ్ కు ఆర్ఎస్ఎస్ అండ:
ఫిబ్రవరి 12వ తేదీనే కన్నాను మరో రెండేళ్లు ఏపీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, అవి ప్రస్తుతం పెండింగ్‌లో పడడంతో కన్నాను సాగనంపడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ మాధవ్ తనకున్న ఆర్ఎస్ఎస్ బలంతో ఢిల్లీలో ఈ మధ్యన ఎక్కువగా గడుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మాధవ్ వ్యవహారంపై మాత్రం కన్నా వర్గం సీరియస్‌గానే ఉందట. పార్టీ బలపడాలంటే కన్నా లక్ష్మీనారాయణనే కొనసాగించాలని, మాధవ్‌కు ఇస్తే మాత్రం పార్టీలో చీలికలు వస్తాయని చెబుతున్నారు. మరోవైపు మాధవ్ వెనక కన్నా వ్యతిరేకవర్గం సపోర్ట్‌ ఉందంట. ఆ వర్గం మద్దతుతోనే మరింత లాబీయింగ్ చేస్తున్నారట. 

మాధవ్ కు సుజనా, రమేష్ మద్దతు:
మాధవ్ తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా పనిచేయడం, ఆర్ఎస్ఎస్ మద్దతుతో పాటు సుజనా, సీఎం రమేశ్‌ సపోర్టు ఉందన్న ప్రచారం జరుగుతోంది. సుజనా, సీఎం రమేశ్‌ కారణంగానే అధ్యక్షుడి ప్రకటనలో అధిష్టానం జాప్యం చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మాధవ్ మాత్రం తానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అవుతానంటూ గంపెడాశలతో ఉన్నారట. పైకి మాత్రం పదవి వచ్చినా రాకపోయినా ఒకటే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని కన్నా... కోర్ కమిటీ, స్ధానిక సంస్థల ఎన్నికల సన్నాహాక సమావేశాలు, జనసేనతో పొత్తుతో ఎవర్ని ఎక్కడ నిలబెట్టాలనే దానిపై పూర్తిగా నిమగ్నమై బిజీ బిజీగా గడుపుతున్నారు. 

వ్యతిరేక వర్గంతో కన్నా పదవికి గండం తప్పదా?
పార్టీ క్యాడర్ కూడా కన్నాకే మద్దతు ఇస్తుండడంతో అధిష్టానం మాత్రం కన్నాను మరో రెండేళ్లు కొనసాగించాలా? లేక వేరే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలా అన్న మీమాంసలో ఉందని అంటున్నారు. మాధవ్ ఎన్ని స్కెచ్‌లు వేసినా మరోసారి కన్నా లక్ష్మీనారాయణకే అధిష్టానం అవకాశం ఇస్తుందని కన్నా వర్గం ఘంటాపథంగా చెబుతోంది. మొత్తం మీద బీజేపీ ఏపీ అధ్యక్షునిగా తన వ్యతిరేకవర్గం రూపంలో కన్నాకు గండం ఉందని అంటున్నారు. తన రాజకీయ చాతుర్యంతో మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారో లేదో వేచి చూడాల్సిందే.

kanna lakshmi narayana
AP BJP
ap bjp president
madhav
RSS
Modi
ap politics
Sujana Chowdary
CM Ramesh

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు