సమ్మక్క పుట్టుక.. అసలు రహస్యం ఇదేనంట! 

Submitted on 3 February 2020
What is Sammakka Birth Secret? Why celebrates Medaram Sammakka Saralamma Jathara every Year in Telangana

సమ్మక్క గిరిజనుల ఆరాధ్య దేవత మాత్రమే కాదు.. గిరిజనులేతర ఇలవేల్పు కూడా. కోట్లాది మంది భక్తుల చేత వేవేల పూజలందుకుంటోన్న వన దేవత. ధీరత్వమే దైవత్వమైన సజీవ సాక్ష్యం సమ్మక్క. ఇంతటి విశ్వాసం వెనుక కారణమేంటి..? జన గుడారంలా మారిపోయే మేడారం మహాజాతర చారిత్రక సత్యాలేంటి? ఇలా సమ్మక్క గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సమ్మక్క మేడారంలో జన్మించలేదా? బయ్యక్కపేటతో సమ్మక్కకు ఉన్న బంధమేంటి? సమ్మక్కను దేవతగా ఎప్పుడు గుర్తించారు? పగిడిద్ద రాజుపై దాడికి సమ్మక్కే కారణామా? వనదేవత గిరిజనులకు శాపాలు ఎందుకు పెట్టింది? రెండేళ్లకొకసారి జరిగే జాతర వెనుక ఉన్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం. 

అసలు విషయంలోకి వెళ్తే.. రాయిబండ రాజుకు పెద్ద భార్య చందబోయిరాలు, చిన్న భార్య కనకంబోయిరాలు. ఎన్ని వ్రతాలు, నోములు చేసినా సంతానం కలగలేదు. దీంతో పెద్ద భార్య ఆదిశక్తిని, చిన్న భార్య నాగదేవతను పూజించారు. ఓ రోజున చందబోయిరాలు దుంపల కోసం కొంత మంది మహిళలతో కలిసి అడవికి వెళ్లింది.

ఎల్లేరు గడ్డను తవ్వుతుండగా గుణపానికి ఏదో తగిలింది. పూర్తిగా తవ్వి బయటకు తీసి చూడగా పెట్టెలో పసిబిడ్డ కనిపించింది. ఆదిశక్తి ప్రసాదించిన సంతానంగా భావించి కన్నుల పండుగగా మేళతాళాలాతో ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సమ్మక్కగా నామకరణం చేశారని చెబుతున్నారు చందా వంశీయులు. పౌర్ణమి రోజున దొరికిన పాపను చూసి ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. 

చందా వంశపు కోయ గిరిజనుల ఆడబిడ్డగా.. సమ్మక్క బయ్యక్కపేటలో జన్మించింది. జాతర జరిగే మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊరు. 1962 వరకూ మేడారం జాతరను బయ్యక్కపేటలోనే నిర్వహించారు గిరిజనులు. స్వయంగా చందా వంశస్తులే సమ్మక్కను ఆరాధించారు. గ్రామంలో సమ్మక్కకు గుడితో పాటు గద్దె కూడా నిర్మించారు. జంతువును బలి ఇస్తూ రెండేళ్ల కోసారి జాతర నిర్వహించేవారు.అప్పటినుంచి సమ్మక్క-సారలమ్మ.. కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారమైంది.

ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర వివిధ తెగలకు చెందిన గిరిజన సంస్కృతికి సంగమంగా నిలుస్తోంది. మొదట్లో తెలంగాణ ప్రాంత కోయ ఆదివాసీ గిరిజనులకు మూలదైవంగా నిలిచిన సమ్మక్క - సారలమ్మలు ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు తమ విశ్వాస సామ్రాజ్యాన్ని విస్తరించారు. వివిధ తెగల గిరిజనులకు కూడా దేవతలుగా నిలిచారు. గిరిజనులకే పరిమితమైన దేవతలు క్రమక్రమంగా గిరిజనేతరులకు కూడా ఆరాధ్య దైవాలుగా నిలిచారు.

Sammakka Birth
Medaram
Sammakka Saralamma Jathara
Bayyakkapet

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు