పార్టీకి దూరం.. సోషల్‌ మీడియాకే పరిమితం : అంతుచిక్కని పీవీపీ అంతరంగం

Submitted on 26 February 2020
what is pvp real target

ఆయనేమో ప్రముఖ పారిశ్రామికవేత్త.. రాజకీయాలంటే ఆసక్తి. ఏదో ఒక పదవిలో సెటిల్‌ అవ్వాలనుకున్నారు. కాలం కలసి రాలేదు. ఒకసారి టికెట్‌ దక్కలేదు. మరోసారి టికెట్‌ దక్కినా గెలుపు పలకరించలేదు. అంతే.. అప్పటి నుంచి ముఖం చాటేశారు. పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. ప్రజలకు అసలే కనిపించడం లేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం చురుకైన పాత్రే పోషిస్తున్నారు. ఒక ట్వీట్‌తో మళ్లీ ఆయన పేరు రాష్ట్రంలో మారుమోగినా... ఆ తర్వాత మళ్లీ మామూలే. 

కేశినేని నాని అడ్డం తిరగడంతో టికెట్‌ ఇవ్వలేకపోయిన చంద్రబాబు:
పొట్లూరి వరప్రసాద్‌.. షార్ట్‌ కట్‌లో పీవీపీగా అందరికీ పరిచయమైన ఈయన బడా వ్యాపారవేత్త. రాజకీయాలంటే ఆసక్తి కూడా ఉంది. గత దశాబ్ద కాలంగా అన్ని పార్టీల్లో టికెట్ల కోసం ప్రయత్నించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ పార్లమెంటు స్థానానికి సీటు ఆశించారు. దాదాపుగా సీటు వచ్చిందనే అనుకున్నారు. దేవినేని ఉమా ఆధ్వర్యంలో విజయవాడ నుంచి పోటీకి తీవ్రంగా ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే, కేశినేని నాని అడ్డం తిరగడం, తనకు కాకుండా సీటు వేరే వారికి ఎలా ఇస్తారనే ప్రశ్నించిన నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో కేశినేని నానికి సీటు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో పీవీపీ నిరాశ చెందారు. 

ఆఖరి నిమిషంలో వైసీపీ తరఫున పీవీపీకి టికెట్‌ కేటాయింపు:
ఆ తర్వాత కనిపించ లేదు. మళ్లీ 2019లో ఎన్నికలు వచ్చాయి. ఈ సమయంలో కూడా ముందుగా టీడీపీ నుంచి సీటు కోసం ప్రయత్నాలు చేశారు. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాదని వేరే వారికి సీటు ఇచ్చే సాహసం చంద్రబాబు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే సమయంలో వైసీపీకి ఆర్థికంగా సమర్ధుడైన అభ్యర్థి బెజవాడ పార్లమెంటుకు కావాల్సి ఉంది. వైసీపీ అధిష్టానం వేర్వేరు పేర్లను పరిశీలించినా కేశినేని నానిపై పోటీ చేయడానికి చాలా మంది సాహసించ లేదు. దీనికి తోడు ఆర్థికపరమైన అంశాలు కూడా ఉండటంతో ఎక్కువ మంది వెనకాడారు. ఆఖరు నిమిషం వరకూ బెజవాడ పార్లమెంటుకు వైసిపీకి అభ్యర్థి ఎవరనేది తేలలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పీవీపీ పేరు తెరమీదకు వచ్చింది.

పార్టీ అధికారంలో ఉన్నా కనిపించకుండా పోయినా పీవీపీ:
ఆర్థికంగా బలమైన వ్యక్తి అని, సామాజికంగా కలిసి వస్తుంది, బెజవాడ స్వస్థలం అని వైసీపీ భావించింది. విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బెజవాడ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని అభ్యర్థులతో పీవీపీకి పొసగలేదు. గడచిన ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ వివాదాలే కొనసాగాయి. దీంతో పాటు ఆర్థికపరమైన అంశాల్లోనూ పీవీపీ సరిగ్గా వ్యవహరించలేదనే ఫిర్యాదులు అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులు వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆయన నాని చేతిలో ఓడిపోయారు. ఎన్నికలు పూర్తయి, రాష్ట్రంలో వైసీపీ పాలన సాగుతున్నా పీవీపీ మాత్రం అడ్రస్ లేకుండా పోయారు.

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా పీవీపీ:
ఎన్నికల ఫలితాల తర్వాత పీవీపీ అసలు నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో కూడా లేరు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవైపు వైసీపీ ప్రభుత్వం ప్రజాహిత పథకాలు చేపడుతూ ముందుకు వెళుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ నిత్యం ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ, పీవీపీ మాత్రం వీటికి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ముందు మాత్రం తాను ఓడినా, గెలిచినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఇపుడు వ్యక్తిగతంగా పీవీపీ ఓడినా, రాష్ట్రంలో అధికారంలో వైసీపీ ఉంది. ప్రజల సమస్యల్ని తీర్చడం ఆయనకు సులభమైన పని. తద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల సరికి బలపడేందుకు కూడా వీలుంటుంది. కానీ, పీవీపీ మాత్రం అందుబాటులో ఆ పని చేయడం లేదని కార్యకర్తలు అంటున్నారు. 

రాష్ట్రానికి మహిళా సీఎంను చూడాలని ఉందన్న పీవీపీ:
ఈ విషయాలను పక్కన పెడితే సోషల్‌ మీడియాలో మాత్రం పీవీపీ యాక్టివ్‌గానే ఉంటున్నారు. ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీట్‌ వైసీపీ వర్గాల్లో కలవరం రేపింది. రాష్ట్రానికి మహిళా సీఎంను చూడాలనుందని ట్వీట్‌ చేయడం.. ఆ తర్వాత పార్టీ ఒత్తిళ్ల మేరకు దానిని తొలగించడం... రాష్ట్రంలో సంచలనమైంది. అసలు పీవీపీ ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్‌ చేశారనేది చర్చనీయాంశమైంది. జగన్‌ జైలుకెళ్తారేమో... ఆయన స్థానంలో భారతి గానీ, షర్మిల గానీ సీఎం కుర్చీలో కూర్చుంటారేమోనని చర్చ సాగింది. మొత్తం మీద పార్టీలో చురుకుగా లేకపోయినా తన ట్వీట్‌ ద్వారా ఒక్కసారిగా పీవీపీ వెలుగులోకి రావడంతో ఆసలు ఆయన ఎక్కడున్నారా అని కార్యకర్తలు ఆరా తీయడం మొదలుపెట్టారట.

Potluri Vara Prasad
PVP
Ysrcp
ap politics
cm jagan
Tweet
women cm
social media
vijayawada
MP
kesinani nani

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు