మండుతున్న ఎండలు : ఆదిలాబాద్ @ 46.3 డిగ్రీలు

Submitted on 22 May 2019
High Temperatures in Telangana

ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డ్ స్తాయిలో నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుర్రుమనిపించే ఎండతో జనం విలవిలలాడుతున్నారు. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బేలలో 46.2, సోనాల, తాంసీలో 46.1, ఆదిలాబాద్‌లో 45.7, తలమడుగు, అర్లిలో 45.4, నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 45.3, హైదరాబాద్‌లో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత ఉంటుందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బాలింతలు, వృద్దులు, పిల్లలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే తప్ప ఎండ సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం మంచిదన్నారు. పొడిగాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. 

ఇది ఇలా ఉంటే.. మంగళవారం (మే 21,209) హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. మే 23, 24వ తేదీల్లో వడగాలులతో పాటు అక్కడక్కడ ఇదే రీతిలో ఒక మాదిరి వర్షాలు పడే సూచనలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. కర్ణాటకపై 1,500 మీటర్ల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దానివల్లే వర్షాలు కురుస్తున్నట్లు చెప్పారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు ఆసిఫాబాద్‌లో 42.5, బొల్లారంలో 29.8, కాప్రాలో 26.8, మేడ్చల్‌లో 23, దూలపల్లి, కుత్బుల్లాపూర్‌లో 11.3, చందూరులో 8.8, కొత్తపేటలో 8.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

high temperatures
Telangana
Hyderabad
Adilabad
heat waves
rain

వాతావరణ వార్తలుమరిన్ని..