Warangal 10 Death Mystery Who Is Sanjay Kumar

యూట్యూబ్ లో చూసి మర్డర్స్ ప్లాన్ : 10 హత్యలు..ఎవరీ సంజయ్ కుమార్ ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎవరీ సంజయ్ కుమార్?.. అతని బాక్‌గ్రౌండ్ ఏంటి?.. ఒక గోదాంలో పనిచేసే ఇతను 10 మందిని ఎలా హత్య చేయగలిగాడు ? సంజయ్‌ చెబుతున్న మాటలను విని పోలీసులే విస్తుపోయారు. సాధారణ మనిషి ఇన్ని హత్యలు ఎలా చేశాడని ఆరా తీశారు. Youtubeలో వీడియోలు చూసి మరీ హత్యలకు ప్లాన్ చేసినట్లు సంజయ్ చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. వరంగల్‌లో సంచలనం రేపిన 9 హత్యలకు సంబంధించి ప్రధాన నిందితుడు సంజయ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. 9 హత్యలే కాకుండా..మరొకరిని కూడా చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొత్తంగా ఇతను పది హత్యలు చేశాడు. 

డెత్ మిస్టరీలో ట్విస్ట్ : – 
నాలుగు రోజులు ఉత్కంఠ రేపిన వరంగల్‌ జిల్లా గొర్రెకుంట డెత్‌ మిస్టరీలో మరో ట్విస్ట్ నెలకొంది. ఇప్పటివరకు 9 హత్యలు అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ సంఖ్య 10కి చేరింది. పోలీసుల విచారణలో తాజాగా 10వ హత్య కూడా వెలుగుచూసింది. మక్సూద్ సమీప బంధువు చోటీని కూడా సంజయ్ కుమారే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. గతంలో చోటీతో సహజీవనం చేసిన సంజయ్‌.. తర్వాత ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. చోటీ హత్య బయటపడుతుందనే భయంతోనే హత్యలకు ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఇక నిందితుడు యూట్యూబ్‌లో మర్డర్‌ స్కెచ్‌లు చూసి మరీ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యలకు సంబంధించి సంజయ్‌కు ఓ ఆటో డ్రైవర్‌ సహకరించినట్లు సమాచారం. 

కాల్ డేటా రికార్డింగ్ ఆధారంగా : – 
కాల్‌ డేటా రికార్డింగ్‌ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాం వద్ద బావిలో శవాలై తేలిన 9 మందిని హతమార్చింది బిహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ అని పోలీసుల విచారణలో వెల్లడైంది. కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లాకే ఒక్కొక్కరిని గోనె సంచుల్లో లాక్కెళ్లి బావిలో పడేసినట్లు సంజయ్‌ పోలీసుల వద్ద అంగీకరించాడు. సంజయ్‌ను విచారిస్తున్న సమయంలో మరో హత్య విషయం కూడా బయటపడింది. మక్సూద్ బంధువు చోటీని కూడా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. మొత్తం 10 ప్రత్యేక బృందాలు 72 గంటల పాటు దర్యాప్తు చేపట్టి 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. స్తంభంపల్లిలోని సంజయ్ కుమార్ ఇంట్లో కీలక ఆధారాలను గుర్తించిన పోలీసులు అతడితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

అసలేం జరిగింది : – 
వరంగల్‌ జిల్లా గొర్రెకుంట సమీపంలోని తొలుత ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు హత్యలేనని పోలీసులు తేల్చారు. మక్సూద్‌ కూతురు బుస్రా ప్రియుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు ఘటన జరిగిన రోజు బుస్రాతో మాట్లాడినట్లు కాల్‌డేటా ద్వారా తెలుసుకుని సంజయ్‌ను విచారించగా విషయం బయటపడింది. సంజయ్‌ యాదవ్‌ మరో వ్యక్తితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. 

బుస్రాపై కన్నేసిన సంజయ్ : – 
నిందితుడు సంజయ్‌ కుమార్ యాదవ్‌.. మక్సూద్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి. గన్నీ బ్యాగులు కుడుతూ మక్సూద్‌ వద్ద పని చేసేవాడు. అలా ఆ కుటుంబసభ్యులకు దగ్గరయ్యాడు. అయితే మక్సూద్‌ కూతురు బుస్రా.. భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. బుస్రా ఒంటరిగా ఉంటుందని గ్రహించిన సంజయ్‌‌.. ఆమెకు దగ్గరవ్వాలనుకున్నాడు. అందులో భాగంగా ఆమెకు గిఫ్ట్‌లు కొనిచ్చేవాడు. ఆర్థికంగా ఆ కుటుంబానికి అప్పుడప్పుడు సాయపడేవాడు. ఇలా ఆ కుటుంబంలో ఒకడిలా కలిసిపోయాడు. 

మరొకరితో సన్నిహితంగా ఉంటోందంటూ : – 
అయితే ఇటీవల బుస్రా… యాకూబ్‌ పాషాతో సన్నిహితంగా ఉంటుందని తెలుసుకున్నాడు. దీంతో తనకు దక్కాల్సిన బుస్రా… మరొకరితో సన్నిహితంగా ఉంటోందంటూ రగిలిపోయాడు. ఆమెను దక్కించుకునేందుకు చాలా డబ్బు ఖర్చు పెట్టిన సంజయ్‌కుమార్‌‌.. ఆ డబ్బంతా తిరిగి రాబట్టాలనుకున్నాడు. బుస్రాపై ఒత్తిడి తెచ్చాడు. తన డబ్బు తనకిచ్చేస్తే బీహార్‌ వెళ్లిపోతానని చెప్పాడు. సంజయ్‌ టార్చర్‌ రోజురోజుకు పెరుగుతుండటంతో… విషయాన్ని  తండ్రికి చెప్పింది. అటు తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న మృతుడు షకీల్‌ కుటుంబానికి కూడా చేరవేసింది. దీంతో మక్సూద్‌, షకీల్ కలిసి‌.. సంజయ్‌కుమార్‌ను మందలించారు. అయినప్పటికీ సంజయ్‌ తీరు మార్చుకోలేదు. ఇక చనిపోయిన ఇద్దరు బీహార్‌ యువకులు శ్యామ్, రామ్‌లకు మక్సూద్‌ కుటుంబంతో పరిచయం ఉంది. దీంతో ఆ ఇద్దరికి కూడా సంజయ్‌కుమార్‌ వేధిస్తున్నాడంటూ బుస్రా చెప్పడంతో వాళ్లు కూడా సంజయ్‌ను గట్టిగా మందలించారు.

అంతం చేయాలని ప్లాన్ : – 
మక్సూద్‌ కుటుంబంపై కోపం పెంచుకున్న సంజయ్.. బీహారీ యువకులనూ అంతం చేయాలనుకున్నాడు. కానీ తనమీద ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. మళ్లీ వారితో కలిసి మంచిగా మెలిగాడు. వాళ్లు కూడా సంజయ్‌ మారిపోయాడని నమ్మారు. అతడితో గతంలోలాగే మాట్లాడుతూ వచ్చారు. ఎంతో తెలివిగా తనపై నమ్మకం వచ్చేలా చేసుకున్నాడు సంజయ్‌. అలాగే వారిని అంతం చేసే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం రానే వచ్చేసింది.

బర్త్ డే వేడుకలు : – 
ఈ నెల 20న మక్సూద్ పెద్ద కుమారుడు షబాజ్ ఆలం తన పుట్టిన రోజు అంటూ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు స్నేహితులు చెబుతున్నారు. దీంతో ఆరోజు మక్సూద్‌ తో పాటు బీహారీ యువకులు గోదాంలో సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు పని ముగించుకొని వెళ్లారు. అలాగే బర్త్ డే వేడుకలకు రావాలని 7 గంటలకు మక్సూద్ భార్య నిషా.. షకీల్‌కు ఫోన్ చేసి పిలిచింది. అయితే 7గంటల 14 నిమిషాలకు షకీల్ గోదాం వద్దకు చేరుకున్నాడు. అయితే 7గంటల 30 నిమిషాలకు మక్సూద్ ఫోన్ మినహా అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి.

బావిలో మృతదేహాలు : – 
అయితే గురువారం రోజు మక్సూద్ కోసం గోదాం యజమాని వచ్చాడు. వారి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఓ బావిలో మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాలను బయటికి తీశారు. అవి మక్సూద్, ఆయన భార్య నిషా, కూతురు బుస్రా, ఆమె మూడేళ్ల బాబుగా గుర్తించి మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి పంపారు. ముందు ఆత్మహత్యగా అనుమానించిన పోలీసులు మక్సూద్ కొడుకులిద్దరితో పాటు గోదాంలో ఉండే బీహారీ యువకులు శ్రీరాం, శ్యాంలు కనపడకపోవడంతో గాలింపు చేపట్టారు. 

పోలీసుల దర్యాప్తు : – 
మక్సూద్ ఇద్దరు కుమారులతో పాటు, శ్రీరాం, శ్యాం, షకీల్‌గా గుర్తించారు. దీంతో ఎవరైనా హత్య చేసి ఉంటారేమోనని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పది బృందాలను రంగంలోకి దింపారు. బావితో పాటు గోదాం పరిసర ప్రాంతాల్లో క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. బుస్రాకు పరిచయం ఉన్న యాకూబ్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 

ఎలా చంపాడంటే : – 
శనివారం రోజు మృతదేహాల పోస్టుమార్టం రిపోర్టును పరిశీలించారు. ప్రాణాలతోనే నీళ్లలోకి పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇందులో వేరే వ్యక్తి ప్రమేయం ఉండొచ్చన్న దిశగా విచారణ మొదలుపెట్టారు. కాల్‌డేటా ఆధారంగా సంజయ్‌కుమార్‌పై అనుమానం కలిగింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. మక్సూద్ పెద్ద కుమారుడు బర్త్ డే వేడుకలకు సంజయ్ కూడా వెళ్లినట్లు తెలిసింది. టాటా ఏస్ వాహనంలో గోదాంకు చేరుకున్న అతను.. ప్లాన్ ప్రకారం మక్సూద్ ఫ్యామిలీతో పాటు షకీల్, బీహారీ యువకులు శ్రీరాం, శ్యాంలకు కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. అనంతరం స్ప్రహ కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరిని ఈడ్చుకెళ్లి బావిలో పడేసినట్లు సంజయ్ పోలీసుల వద్ద అంగీకరించినట్లు తెలిసింది. 

సీసీ కెమెరాల పరిశీలింపు : – 
మృతులకు ఇచ్చిన నిద్రమాత్రలను నగరంలోని మందుల దుకాణాల నుంచి సంజయ్ తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో నగరంలోని దుకాణాల్లో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే గోదాం వద్దకు సంజయ్‌తో పాటు ఎవరైనా వెళ్లారా అన్న విషయాలపైనా ఆరా తీస్తున్నారు. స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే చోటీని హత్య చేసింది కూడా తానేనని నిందితుడు అంగీకరించాడు.