రాజధాని విశాఖ.. పోలీసులు అప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు

Submitted on 28 February 2020
Vizag police begin ground work in view of Executive capital plan

ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కానుందని జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర కూడా వేసింది. త్వరలో చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కావడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో విశాఖ ట్రాఫిక్ పోలీసులు ఆ దిశగా అప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు.

విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అయితే.. ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొనే ప్రధానమైన సవాల్.. ట్రాఫిక్ నిర్వహణ. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అయ్యాక విశాఖలో గణనీయంగా వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దాంతో ట్రాఫిక్ సమస్య తీవ్రం కావొచ్చని అధికారులు అంచనావేశారు. సమస్యను ముందే గుర్తించిన అధికారులు.. ట్రాఫిక్ నిర్వహణ దిశగా అప్పుడే చర్యలు చేపట్టారు. పరిస్థితిని ఫేస్ చేసేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అంతా స్మూత్ గా సాగిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. రహదారుల విస్తరణ, రిపేర్లు, ఫైఓవర్లు, ఫుట్ పాత్ ల నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టారు.

ఎగ్జిక్యూటివ్ రాజధాని అయ్యాక విశాఖ రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య వేలల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విశాఖ సిటీ నుంచి పాస్ అయ్యే 72 కిలోమీటర్ల నేషనల్ హైవే-16పై ట్రాఫిక్ నిర్వహణ పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. ఈ దారి అనకాపల్లి, విజయనగరం, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ లను కూడా టచ్ చేస్తుంది. ఉద్యోగులు, విద్యార్థులే కాదు.. బ్యారోక్రాట్లు, రాజకీయ నాయకులు కూడా ఈ హైవే మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఎన్ హెచ్ -16పై ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ప్రయాణం సాఫీగా సాగేలా చేయడం పోలీసుల ముందున్న సవాల్. 

ఈ హైవే పై యాక్సిడెంట్ల సంఖ్య కూడా ఎక్కువే. నగరంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 40శాతం ఇక్కడే నమోదవుతుంటాయి. ఇక అనేక ఇంజినీరింగ్ లోపాలు, గుంతలు ఉన్నాయి. వాటన్నింటిని వెంటనే రిపేర్ చేయాల్సి ఉంది. దీంతో పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలపైనా ఫోకస్ పెట్టారు. చిన్న చిన్న ఫ్లై ఓవర్లు తక్షణమే నిర్మించాలని నిర్ణయించారు. వాటి ద్వారా ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేయొచ్చని భావిస్తున్నారు. ఐదు ప్రధాన జంక్షన్లు మారికవలస, హనుమంతవాక, మద్దిపాలెం, తాటచెట్ పాలెం, గాజువాకలో ఫ్లైఓవర్లు నిర్మించాలని యోచిస్తున్నారు. చిన్న ఫ్లైఓవర్లు కూడా ఒక దిశలో ట్రాఫిక్ పి సులభతరం చేస్తాయి, ఎడమ-కుడి మలుపులు లేకుండా చేస్తాయని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు.

అనేక జంక్షన్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ ను ట్రాఫిక్ ప్రవాహాన్ని బట్టి సమయానికి అనుగుణంగా మార్చాల్సి ఉందన్నారు. స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమయ్యే అనేక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. 72 కిలోమీటర్ల ఎన్‌హెచ్‌ స్ట్రెచ్‌తో పాటు 24 అండర్‌పాస్‌లు లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్‌ఓబి) నిర్మించడానికి నగర పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా పాదచారులు బాధితులు అవుతున్నారు. అందువల్ల అన్ని జంక్షన్లను కవర్ చేస్తూ 24 అండర్‌పాస్‌లు లేదా ఎఫ్‌ఓబిలను ప్రతిపాదించామని ఓ పోలీసు అధికారి తెలిపారు.

''ట్రాఫిక్ పోలీసుల ముందున్న మరో తక్షణ సవాల్.. సిబ్బంది. ట్రాఫిక్ సిబ్బందిని సుమారు 25% పెంచాల్సిన అవసరం ఉంది. "ట్రాఫిక్ విభాగంలో ఇప్పుడు 800 మంది సిబ్బంది, అధికారులు ఉన్నారు. అదనంగా కనీసం 200 మంది సిబ్బంది అవసరం. డిపార్టుమెంటుకు కేటాయించిన హోమ్ గార్డ్స్ సంఖ్యను కూడా 300 నుండి 450 కి పెంచాల్సిన అవసరం ఉంది ”అని విశాఖ పోలీస్ కమిషనర్ చెప్పారు. వీటితో పాటు ప్రధానంగా పరిష్కరించాల్సిన మరో ముఖ్యమైన సమస్య పార్కింగ్ స్థలాలు. రానున్న రోజుల్లో ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను నోట్ చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. వాటి పరిష్కారాలపై ఫోకస్ పెట్టారు.

Vizag police
begin
ground work
executive capital
cm jagan
traffic police
national Highway
Roads
flyovers
foot paths

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు