వాల్మీకి టైటిల్ మారింది: మొదటిసారి ఓడిపోయా అనిపిస్తోంది

Submitted on 20 September 2019
Valmiki Film name change Director Harish Shankar

వాల్మీకి టైటిల్‌పై తలెత్తిన వివాదానికి సినిమా యూనిట్ తెరదించింది. సినిమా పేరును గద్దలకొండ గణేష్‌గా మార్చింది. బోయ సామాజిక వర్గం నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఈ సినిమా మారిన టైటిల్‌తో సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

వాల్మీకి సినిమాను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం రిలీజ్ అవుతున్న క్రమంలో మరిన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. వాల్మీకి టైటిల్ లోగోలో తుపాకీ ఉండటం వివాదానికి కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లోని వాల్మీకి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. టైటిల్‌ను మార్చాలని లేకుంటే థియేటర్ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించాయి. కొందరు రాజకీయనాయకులు సైతం సినిమా యూనిట్‌ను టైటిల్ మార్చాలంటూ సూచించారు.

ఏపీ మంత్రి శంకరనారాయణ కూడా సినిమా టైటిల్‌ మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు. కర్నూల్, అనంతపురం జిల్లాల్లో సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ యాజమాన్యాలకు కలెక్టర్లు ఆదేశించారు. వాల్మీకి టైటిల్‌ మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై చిత్ర యూనిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

సినిమా దర్శక, నిర్మాతలు రెస్పాండ్ అయ్యారు. 14 రీల్స్ నిర్మాణ సంస్థ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. మూవీ పేరు మారుస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. గద్దలకొండ గణేష్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

మీడియా సమావేశంలో పాల్గొన్న సినిమా డైరక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. మొదటిసారి ఓడిపోయా అనిపిస్తోందంటూ వాపోయారు. ఓడిపోవడం అంటే పర్సనల్‌గానో, ప్రొఫెషనల్‌గానో కాదని ఓ హైందవ సమాజపు వ్యక్తిగా వాల్మీకి మహర్షి మీద గౌరవాన్ని, మంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఓడిపోయానని అనిపిస్తోందని అన్నారు. 

సినిమాలో తాము ఎవరినీ కించపర్చలేదంటున్నారు డైరెక్టర్ హరీశ్ శంకర్. వాల్మీకి మహర్షి గొప్పతనం అందరికీ తెలవాలనే ఉద్దేశ్యంతోనే ఆ టైటిల్ పెట్టామన్నారు. సెన్సార్‌ బోర్డు కూడా ఎక్కడా అభ్యంతరం చెప్పలేదన్న హరీశ్ శంకర్... సినిమా చూడకుండా అభ్యంతర విషయాలు ఉన్నాయని ఆందోళన చేయడం బాధించిందన్నారు. 

వరుణ్ తేజ్ క్యారెక్టర్ పేరు గద్దలకొండ గణేష్. ఇదే పేరును సినిమాకు పెట్టారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. వరుణ్ తేజ్ సరసన..పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. 
Read More : అక్కినేని జయంతి : ANR LIVES ON

Valmiki
Film name
Change
Director Harish Shankar

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు