కరోనా భయంతో 5G టవర్లు తగులబెడుతున్న బ్రిటన్ ప్రజలు

Submitted on 9 April 2020
UK mobile carriers politely ask people to stop burning 5G towers

5G టవర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ప్రచారాన్ని నమ్మి 5G మొబైల్ టవర్లకు నిప్పు పెడుతున్నారు బ్రిటన్ ప్రజలు. యూకే వ్యాప్తంగా ఇప్పటివరకు పదికి పైగా మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు. ఆయా వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఓ వైపు కరోనా వైరస్‌ను దెబ్బకు ఇబ్బందిపడుతున్న బోరిస్ ప్రభుత్వానికి ఈ ఘటనలు పుండు మీద కారం చల్లినట్లుగా మారాయి. యూకేలోని పలు ప్రాంతాల్లో ప్రజలు 5G మొబైల్ టవర్లపై దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఏం జరిగింది? 
యూకేలోని మొబైల్ సంస్థలు 4G కంటే మరింత మెరుగైన నెట్‌వర్క్ అందించేందుకు 5G సేవలను అందుబాటులోకి తెచ్చాయి. అయితే, ఈ అత్యాధునిక టెక్నాలజీకి కరోనా వైరస్‌ను సైతం ఆకర్షించే శక్తి ఉంటుందని, ఈ సిగ్నల్స్ ద్వారా వ్యాపిస్తోందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారు. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న కరోనా వైరస్ మరణాలకు 5G మొబైల్ నెట్‌వర్క్ కారణమని పేర్కొన్నారు. ఈ వదంతులు నమ్మిన ప్రజలు 5G మొబైల్ టవర్లపై దాడులు చేయడం మొదలుపెట్టారు. వాటిని తగలబెడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆకతాయిలు ధ్వంసం చేస్తున్న మొబైల్ టవర్లకు మరమ్మతులు చేయడానికి వెళ్తున్న నెట్‌వర్క్ సిబ్బందిపై కూడా దాడులు జరుగుతున్నాయి. దీంతో యూకే ప్రభుత్వం అప్రమత్తమైంది.

పూర్తి అవాస్తవం..NHS

5జీ మొబైల్ టవర్లతో కరోనా వైరస్ వ్యాపిస్తుందనే ప్రచారం పూర్తి అవాస్తవమని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) స్పష్టం చేసింది. కరోనా వైరస్ కేవలం మనుషి నుంచి మనిషికి లేదా బాధితుడు తాకిన వస్తువుల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని తెలిపారు. కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆలోచన లేకుండా ఇలాంటి అసత్య ప్రచారానికి మద్దతు పలుకుతున్నారని, ఇలాంటి సందర్భాల్లో బాధ్యతయుతంగా ఉండాలని పేర్కొన్నారు. 

మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ల సంయుక్త ప్రకటన 

గత వారం రోజులుగా జరుగుతున్న ఈ దాడులు మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలను బెంబేలెత్తిస్తున్నాయి. వొడాఫోన్, ఈఈతోపాటు మరో మూడు సంస్థల 5G నెట్‌వర్క్ టవర్లు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో మొబైల్ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా కరోనా వైరస్ చాలా సులభంగా ప్రజలకు వ్యాపిస్తుందనే ప్రచారంతో బర్మింగ్‌హమ్, లివర్‌పూల్‌లో దాడులు మొదలయ్యాయి.

ఈ ఘటనలను ఖండిస్తూ యూకే మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. 5జీ నెట్‌వర్క్ ద్వారా వైరస్ వ్యాపిస్తుందనే ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితం కాలేదని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మవద్దని కోరారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ నిబంధనలను కఠినతరం చేసింది. 5జీ టవర్లను కాలుస్తున్న వీడియోలను తొలగిస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు కూడా ఆయా వీడియోలను, అసత్య ప్రచారాలను తొలగించాలని అధికారులు ఆదేశించారు.

5G TOWERS
BRITAN
UK
BURNS
MOBILE CARRIERS
JOINT STATMENT
release
FAKE PROPAGANDA
social media
spread
coronavirus
covid19

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు