వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

Submitted on 10 October 2019
tirumala special darshan

తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. నెలలో రెండు రోజులు వారికి ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 15, 29 తేదీల్లో వృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ 2 రోజుల్లో ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.

ఐదేళ్లలోపు చంటి పిల్లల(ఐదేళ్లలోపు) తల్లిదండ్రులకు అక్టోబర్ 16, 30 తేదీల్లో బుధవారం ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటలకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇక మీదట ప్రతినెల 2 రోజులు వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు స్వామివారిని దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

65 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మహద్వారం నుంచి ఆలయంలోకి అనుమతించి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. 65 ఏళ్లు దాటినట్టు నిర్ధారించే గుర్తింపు కార్డున్న భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దివ్యాంగులు కూడా సంబంధిత మెడికల్‌ సర్టిఫికెట్‌ చూపించి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయాల్లో ఇతర భక్తులను దర్శనానికి లోనికి అనుమతించరు. ఏడాది వయస్సు కలిగిన చంటి బిడ్డల తల్లిదండ్రులను సుపథం నుంచి వైకుంఠం-1 క్యూ కాంపెక్స్‌లోకి అనుమతిస్తారు. వీరు తమ చంటి బిడ్డతో నేరుగా శ్రీవారిని దర్శనానికి వెళ్లొచ్చు. 

వెంకన్న దర్శనం కోసం తిరుమల కొండకు చేరుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సగటున రోజుకు 50 వేల నుంచి 60 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటుంటారు. వీకెండ్, ప్రత్యేక పర్వదినాల్లో ఈ సంఖ్య లక్ష వరకు చేరుకుంటుంది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా టీటీడీ ఎప్పటికప్పుడు ప్రత్యేక సౌకర్యాలు సమకూరుస్తోంది. స్వామిని దర్శించుకోవడానికి పలు రకాల దర్శనాలు ఏర్పాటు చేస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చాక కొత్త టీటీడీ బోర్డు ఏర్పాటైంది. వెంకన్న దర్శనం విషయంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తోంది. భక్తులకు మరింత సులభంగా, వేగంగా శ్రీవారి దర్శనం జరిగేలా చర్యలు చేపట్టింది.

Tirumala
special darshan
old age people
disabled persons
Tokens
TTD

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు