కిక్కు దిగింది.. చోరీకెళ్లిన ఇంట్లో నిద్రపోయిన దొంగ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Submitted on 27 February 2020
A Thief Broke Into a House in Karnataka but Got Caught Taking a Nap on the Couch

దొంగతనం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. ఎంతో అటెన్ష్ గా ఉండాలి. ఏ మాత్రం దొరికినా ప్రాణాలకే ప్రమాదం. దొంగలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే రంగంలోకి దిగుతారు. ప్రాణాలను పణంగా పెట్టి చోరీలకు స్కెచ్ వేస్తారు. దోచుకున్న సొమ్ముతో ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎవరి కంటా పడకుండా ఎస్కేప్ అవ్వాలని చూస్తారు. జనరల్ గా దొంగలందరి తీరు ఇలానే ఉంటుంది. అయితే ఈ తాగుబోతు దొంగ మాత్రం.. అందుకు పూర్తి భిన్నం. చోరీ చేసేందుకు వెళ్లిన ఇంట్లోనే నిద్రపోయాడు. కట్ చేస్తే.. ఇంటి ఓనర్ వచ్చి లేపాల్సి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి అత్తగారింటికి తీసుకెళ్లారు.

కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ఉల్లాస్ జంక్షన్ దగ్గర ఈ వింత ఘటన జరిగింది. ఆ దొంగ పేరు అనిల్ సహాని. ఈ దొంగ తాగుబోతు కూడా. మంగళవారం (ఫిబ్రవరి 25,2020) రాత్రి ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఎంతో కష్టపడి ఇంటి పైకప్పు తొలగించి లోపలికి వెళ్లాడు. టీవీ స్టాండ్ పక్కన పెట్టిన తాళాలు తీసుకున్నాడు. విలువైన వస్తువులన్నీ మూటకట్టాడు. వాటితో ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ వేశాడు. కిక్కు ఎక్కువైందో మరో కారణమో కానీ.. అంతలోనే అతగాడికి నిద్ర ముంచెత్తుకొచ్చింది.

దీంతో.. ముందు నిద్ర తర్వాతే దొంగతనం అని భావించి ఆ ఇంట్లో ఓ మూలన కనిపించిన సోఫాలో కూలబడి హాయిగా నిద్రపోయాడు. అతడు ఎంత డీప్ స్లీప్ లోకి వెళ్లాడంటే.. చూస్తుండగానే తెల్లవారి పోయింది. బుధవారం(ఫిబ్రవరి 25,2020) ఉదయం ఇంటి పైకప్పు తొలగించి ఉండడం చూసిన యజమాని సుదర్శన్‌ షాక్ అయ్యాడు. గదిలో చూస్తే చక్కగా సోఫాలో గుర్తు తెలియని ఓ వ్యక్తి పడుకోవడం చూసి మరింత కంగుతిన్నాడు. అతను కచ్చితంగా దొంగే అని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత ఓ కర్ర తీసుకుని వచ్చి.. సోఫాలో డీప్ స్లీప్ లో ఉన్న దొంగను కొట్టి లేపాడు. ఎవరో తనను లేపుతున్నట్టు అనిపించి దొంగ కళ్లు తెరిచాడు. అంతే.. షాక్ కి గురయ్యాడు. తాను అడ్డంగా దొరికిపోయానని తెలుసుకుని నిర్ధాంతపోయాడు. అతడి నోట మాట రాలేదు.

ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దొంగను బీహార్‌ కి చెందిన అనిల్ సహానీగా పోలీసులు గుర్తించారు. అతను మద్యం మత్తులోనే దొంగతనానికి పాల్పడ్డాడని.. మత్తెక్కి నిద్రపోయాడని పోలీసులు తెలిపారు. ఈ దొంగ కథ సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఏం దొంగవు రా బాబూ అని అంతా నవ్వుకుంటున్నారు.

1

 Thief
broke
house
karnataka
Caught
Nap
Couch
Robber
thieve
sleep
sofa
Drunken

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు