Food Safety Raids: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. కరాచీ బేకరీ సహా 6 సంస్థల లైసెన్సులు సస్పెండ్.. రూ.6.59 లక్షల కల్తీ ఆహారం సీజ్!

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు 19 ప్రముఖ బేకరీలు, మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు (Food Safety Raids)నిర్వహించి రూ.6.59 లక్షల విలువైన కల్తీ ఆహారాన్ని సీజ్ చేశారు.

Hyderabad food safety raids karachi bakery metro licious licenses suspended adulterated food seized

Food Safety Raids: హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆహార తయారీ, విక్రయ సంస్థలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 11 ప్రత్యేక బృందాలు ‘క్యూర్’ పరిధిలోని 15 మాంస విక్రయ, ప్రాసెసింగ్ యూనిట్లు, 4 కరాచీ బేకరీ తయారీ కేంద్రాలపై ఏకకాలంలో మెరుపు దాడులు (Food Safety Raids)నిర్వహించాయి. మెట్రో క్యాష్ అండ్ క్యారీ, లిషియస్, కరాచీ బేకరీ యూనిట్లు, వతన్ ఫ్రెష్ మార్ట్, పంజాబ్ ఫిష్ కంపెనీ సహా మొత్తం 19 ప్రముఖ సంస్థల్లో జరిగిన ఈ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.

Visakhapatnam Railway Station: సరికొత్త హంగులతో విశాఖ రైల్వేస్టేషన్.. రూ.660 కోట్లతో,14 ప్లాట్‌ఫారాలతో.. 2028 నాటికి ప్రాజెక్టు పూర్తి!

తీవ్ర అపరిశుభ్రత, ఎలుకల స్వైరవిహారం.. 1,672 కిలోల కల్తీ ఆహారం ధ్వంసం:

అధికారుల తనిఖీల్లో పలు సంస్థలు కనీసం FSSAI లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. తయారీ కేంద్రాల్లో నేలంతా రక్తపు మరకలు, మాంసం వ్యర్థాలతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుండగా, ఆహార పదార్థాల మధ్య బతికున్న ఎలుకలు, బొద్దింకలు, ఈగలు తిరగడాన్ని అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలపై తప్పుడు లేబుల్స్ వేసి విక్రయిస్తున్నట్లు తేలడంతో, సుమారు రూ. 6,59,213 విలువైన 1,672 కిలోల కల్తీ సరుకును సీజ్ చేసి ధ్వంసం చేశారు. నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించిన నల్లకుంట, ఎర్రగడ్డ, సికింద్రాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల్లోని 5 మాంస విక్రయ కేంద్రాలను అధికారులు తక్షణమే మూసివేశారు.

కరాచీ బేకరీ సహా ఆరు సంస్థల లైసెన్సులు సస్పెండ్.. తప్పుడు లేబులింగ్‌తో మోసం:

గగన్‌పహాడ్‌లోని కరాచీ బేకరీ పెర్ల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అక్టోబర్‌లో తయారైన ఆహార పదార్థాలపై నవంబర్ తేదీలతో తప్పుడు లేబుల్స్ వేసి విక్రయిస్తుండటాన్ని గుర్తించిన అధికారులు, రూ. 4.34 లక్షల విలువైన 1,012 కిలోల ప్యాక్డ్ ఫుడ్‌ను సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీ కరాచీ ఐఎన్‌సీలో క్లీనింగ్ కెమికల్స్‌తో పాటు ఆహార పదార్థాలు నిల్వ చేయడం, వెజ్-నాన్‌వెజ్ ఒకే ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల లైసెన్స్ సస్పెండ్ చేశారు. వీటితో పాటు వతన్ ట్రేడర్స్, పంజాబ్ ఫిష్ కంపెనీ, మెసర్స్ హై ప్రోటీన్, ఎస్ఎం సీ కార్పొరేషన్ సంస్థల్లో తీవ్ర అపరిశుభ్రత, తుప్పు పట్టిన పరికరాలు, గడువు ముగిసిన రొయ్యల నిల్వ కారణంగా వాటి లైసెన్సులను రద్దు చేసి వ్యాపారాన్ని నిలిపివేశారు.

మెట్రో, లిషియస్ సహా 10 సంస్థలకు షోకాజ్ నోటీసులు.. కఠిన చర్యల హెచ్చరిక:

తనిఖీల్లో స్వల్ప లోపాలు కనిపించిన ముషీరాబాద్ వతన్ ఫ్రెష్ మార్ట్, ఉప్పల్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థలకు అధికారులు ‘ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు’ జారీ చేశారు. మరోవైపు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ (గగన్‌పహాడ్, మూసాపేట్, సుచిత్ర బ్రాంచ్‌లు), ఎంజే మార్కెట్ కరాచీ బేకరీ, మేడ్చల్ లిషియస్ సహా మూసివేసిన 5 సంస్థలకు (మొత్తం 10 సంస్థలకు) భారీ జరిమానాలు విధించేందుకు ‘షోకాజ్ నోటీసులు’ ఇచ్చారు. ప్రజారోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.