Cherlapally Railway Station: చర్లపల్లి రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం.. లూప్‌లైన్ బోగీలో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం!
హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వేస్టేషన్లో(Cherlapally Railway Station) నిలిపివున్న అదనపు రైలు బోగీలో మంటలు చెలరేగగా మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.
Fire accident at cherlapally railway station spare coach catches fire
Cherlapally Railway Station: హైదరాబాద్‌లోని కీలక రైల్వే టెర్మినల్‌గా అభివృద్ధి చెందుతున్న చర్లపల్లి రైల్వేస్టేషన్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ 5, 6 మధ్య ఉన్న లూప్లైన్లో నిలిపివుంచిన అదనపు (స్పేర్) రైలు బోగీల్లో ఒకదానిలో సాయంత్రం 6.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు, స్థానిక సిబ్బంది కొంత ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, సుమారు 50 నిమిషాల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రాణ నష్టం జరగలేదు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభం:
ఈ అగ్నిప్రమాదంలో(Cherlapally Railway Station) ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఖాళీగా నిలిపివుంచిన అదనపు బోగీ కావడంతో పెను ముప్పు నివారించగలిగామని తెలిపారు. అయితే, నిలిపివున్న బోగీలో మంటలు ఎలా వ్యాపించాయనే కోణంలో లోతైన దర్యాప్తు ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు.
