CV Anand: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. త్వరలోనే వన్ వే, ప్రత్యేక బస్ లైన్.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన!

సైబరాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు త్వరలోనే వన్ వే విధానంతో పాటు ప్రత్యేక బస్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్(CV Anand) వెల్లడించారు.

DGp cv anand key comments on Cyberabad it coridro traffic relief and one way dedicated

CV Anand: సైబరాబాద్ ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాంతంలో వన్ వే విధానంతో పాటు ప్రత్యేకంగా బస్ లైన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ మార్పులు విజయవంతంగా అమలు కావాలంటే సామాన్య ప్రజలు, ఉద్యోగులు పోలీసు యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సైబరాబాద్‌లో రద్దీ నియంత్రణపై సీఎంసీ, సైబరాబాద్ పోలీసు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సైబరాబాద్ మూవ్స్-2026’ సదస్సును డీజీపీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లండన్ ట్రాన్స్‌పోర్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశివర్మ, బగోటా మేయర్ ఎన్రీకి పెనలోజా ప్రత్యేక అతిథులుగా హాజరవగా, సైబరాబాద్ సీపీ రమేష్‌తో పాటు ఐటీ సంస్థల ఉద్యోగులు, విద్యార్థులు, స్టార్టప్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Silent Party: విజయవాడలో ‘సైలెంట్ పార్టీ’ కలకలం.. గోడలపై వింత పోస్టర్లు.. నెట్టింట వైరల్, అసలు మర్మమేంటి?

80 శాతం మంది వ్యక్తిగత వాహనాలే.. 20 ఏళ్లలో మారిన చిత్రం:

సదస్సులో భాగంగా ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు వివిధ సంస్థలు రూపొందించిన ఉత్తమ విధానాలను డీజీపీ సీవీ ఆనంద్(CV Anand) అతిథులతో కలిసి పరిశీలించారు. అలాగే కూడళ్ల అభివృద్ధి ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సైబరాబాద్ పోలీస్, సెక్యూరిటీ కౌన్సిల్ మరియు లివింగ్ ల్యాబ్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఉద్యోగులు, స్థానికులకు పలు సూచనలు చేసిన డీజీపీ, గత రెండు దశాబ్దాల్లో సైబరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. ప్రస్తుతం సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారని, అయితే వారిలో దాదాపు 80 శాతం మంది వ్యక్తిగత వాహనాల్లో రాకపోకలు సాగించేందుకు మొగ్గు చూపుతున్నారని వివరించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే పరిష్కారం.. ఐటీ కారిడార్‌లో కొత్త ఆశలు:

వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా ఉండటంతో ఐటీ కారిడార్‌లో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. సైబరాబాద్ పోలీసులు, సీఎంసీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేవలం అధికారిక ప్రయత్నాలతోనే సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. ప్రజలు, ఉద్యోగుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సు ద్వారా ట్రాఫిక్ కష్టాలకు ఆచరణాత్మక పరిష్కార మార్గం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.