Cyberabad Moves 2026 : ఒక్కరి ప్రయాణం కాదు.. ఇక అందరి బాధ్యత.. ట్రాఫిక్ తగ్గించేందుకు సైబరాబాద్ పిలుపు!
Cyberabad Moves 2026 : సైబరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించేందుకు (Cyberabad Moves 2026) రెడీ అవుతోంది.. ప్రజారవాణా, కార్‌పూలింగ్ ప్రాధాన్యతను చాటుతూ నవంబర్ 26 నుంచి 28 వరకు టీ-హబ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు..
- Sreehari A
- Updated on- November 24, 2026 / 09:28 PM IST
Cyberabad Moves 2026
- గంటల తరబడి ట్రాఫిక్‌లో ఉండాల్సిన పనిలేదు..
- సైబరాబాద్ మూవ్స్‌తో సరికొత్త అడుగు
- ట్రాఫిక్ రద్దీకి గుడ్‌బై చెప్పే టైమ్ వచ్చేసింది
Cyberabad Moves 2026 : హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంటేనే వాహనదారులకు చెమటలు పట్టే పరిస్థితి.. ఆఫీసుకు వెళ్లాలన్నా.. ఇంటికి తిరిగి రావాలన్నా రోడ్లపైనే గంటల కొద్దీ సమయం గడిచిపోతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఈ కష్టాలు మరింత ఎక్కువనే చెప్పాలి..
రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు సైబరాబాద్‌లో ఓ కొత్త ప్రయత్నం మొదలవుతోంది. అదే ‘సైబరాబాద్ మూవ్స్ 2026’. ఇంతకీ ఇదేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
నగరవాసులకు సైబరాబాద్ కమిషనర్ పిలుపు
సొంత వాహనాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ప్రయాణించడం కన్నా ప్రజారవాణా, కార్‌పూలింగ్ వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ నగరవాసులకు పిలుపునిచ్చారు.
నవంబర్ 26 నుంచి 28 వరకు రాయదుర్గంలోని టీ-హబ్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో కలిసి ప్రత్యేక పోస్టర్‌ను కూడా ఆయన విడుదల చేశారు..
Read Also : Simhachalam Temple : సింహాచలం అప్పన్న ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్ రూల్స్.. పురుషులు, మహిళలు ఏం వేసుకోవాలంటే?
ప్రయాణ విధానంలో మార్పు అవసరం :
హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు పెరుగుతున్నాయి. కొత్త సంస్థలు, ఉద్యోగ అవకాశాలతో పాటు నివాస సముదాయాలు కూడా విస్తరిస్తున్నాయి. దీంతో ప్రతిరోజూ రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా ఇంధన ఖర్చులు, వాయు కాలుష్యం, ప్రయాణ సమయం వృథా వంటి సమస్యలు నగరవాసులను ఇబ్బంది పెడుతున్నాయి..
ప్రతి ఒక్కరూ తమ ప్రయాణ విధానంలో చిన్న మార్పు చేసుకున్నా పెద్ద ఫలితం ఉంటుందన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఒకే దారిలో వెళ్లేవారు కలిసి కార్‌పూలింగ్ చేయడం, బస్సులు, ఇతర ప్రజారవాణా సదుపాయాలను వినియోగించుకోవడం ద్వారా రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించవచ్చు..
3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు :
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ), షిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి..
నవంబర్ 26 నుంచి 28 వరకు కార్యక్రమాలు :
నవంబర్ 26 నుంచి 28 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శనలు, చర్చలు, సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వ అధికారులు, రవాణా రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇందులో పాల్గొననున్నారు..
ట్రాఫిక్ సమస్యను పోలీసులే పరిష్కరించాలనుకోవడం కన్నా ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే మార్పు సాధ్యమవుతుంది. మనం చేసే చిన్న ప్రయాణ మార్పు.. నగర రోడ్లపై పెద్ద ఉపశమనాన్ని తీసుకురావచ్చు.
