KTR On Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు BRS స్వాగతం.. పారదర్శకంగా పునర్విభజన జరగాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కాపాడేలా సవరించిన డీలిమిటేషన్ బిల్లును(KTR On Delimitation Bill) బీఆర్ఎస్ స్వాగతిస్తోందని కేటీఆర్ తెలిపారు. దీనివల్ల తెలంగాణలో 180 అసెంబ్లీ, 26 లోక్‌సభ సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు.

Brs party working president ktr brs welcomes revised delimitation bill

KTR On Delimitation Bill: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై రాజకీయ వేడి రాజుకుంటోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కాపాడేలా సవరించిన డీలిమిటేషన్ బిల్లును స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల వాటాను యథాతథంగా కొనసాగించే ఈ మార్పు దక్షిణాది ప్రజల విజయమని పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేస్తోన్న డిమాండ్ ఇదేనని, లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం తప్పనిసరిగా కొనసాగాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

Regional Ring Road: రీజినల్ రింగు రోడ్డుపై సర్కార్ కీలక అప్డేట్.. 1,869 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్.. మార్చిలోపు పూర్తయ్యేలా టార్గెట్!

తెలంగాణ సీట్ల పెంపు అంచనాలు.. పోరాట ఫలితం ఇదే:

గతంలో దక్షిణాదికి నష్టం కలిగించేలా ఉన్న బిల్లును(KTR On Delimitation Bill) పార్లమెంటులో వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేసిన కేటీఆర్, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దక్షిణాది, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా బిల్లును సవరించడం హర్షణీయమన్నారు. జనాభా పెరుగుదల ఆధారంగా కాకుండా తీసుకువస్తున్న తొలి డీలిమిటేషన్ ఇదేనని, బీఆర్ఎస్ పోరాటంతో పాటు దక్షిణాది ఐక్య ఉద్యమం ఫలించిందని చెప్పారు. ఈ బిల్లు అమలైతే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 180కి, లోక్‌సభ స్థానాలు 26కి పెరిగే అవకాశం ఉందని కేటీఆర్ వివరించారు.

పారదర్శకతకు డిమాండ్.. కాంగ్రెస్ వైఖరిపై సూటి ప్రశ్నలు:

డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో నిర్వహించాలని కేటీఆర్ కోరారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన, తెలంగాణకు, దక్షిణాదికి మేలు చేసే ఈ బిల్లును కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోందని నిలదీశారు. మళ్లీ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగాలని కాంగ్రెస్ కోరుకుంటోందా అని ప్రశ్నిస్తూ, అలా జరిగితే తెలంగాణకూ, దక్షిణాదికీ తీరని నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యామ్నాయ మార్గాన్ని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.