MS Dhoni IPL Retirement : ఎంఎస్ ధోనీ బిగ్ డెసీషన్.. ఐపీఎల్‌కు గుడ్‌బై.. ఇక నుంచి కొత్త బాధ్యతలు..
MS Dhoni IPL Retirement : ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగుతున్నాడు. అతడి నాయకత్వంలో సీఎస్కే ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
- Harish Thanniru
- Updated on- November 17, 2026 / 03:48 PM IST
MS Dhoni IPL Retirement
MS Dhoni IPL Retirement : కోట్లాది మంది అభిమానులు ‘తల’ అని పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలికాడు. కొన్నాళ్లుగా ఫిట్‌నెస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ధోని.. ఐపీఎల్ టోర్నీకి రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, అభిమానులకు ఊరటకలిగించే అంశం ఏమిటంటే.. ఇకపై మైదానంలో ఆటగాడిగా కనిపించకపోయినా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో తన అనుబంధాన్ని కొనసాగించనున్నాడు. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి సీఎస్కే జట్టు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగుతున్నాడు. అతడి నాయకత్వంలో సీఎస్కే ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లను కూడా సాధించింది. ధోనీ నాయకత్వంలో చెన్నై జట్టు ఎన్నో విజయాలను అందుకుంది. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం అతడి ప్రత్యేకతగా నిలిచాయి. మొత్తంగా, ధోనీ ఐపీఎల్‌లో 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌గా 158 క్యాచ్‌లు అందుకుని, 47 స్టంపింగ్స్ చేశాడు.
2024 సీజన్‌కు ముందు ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. అయినప్పటికీ ఆటగాడిగా జట్టులో కొనసాగాడు. ఇప్పుడు ఐపీఎల్‌కు ఆటగాడిగా వీడ్కోలు పలికి మెంటార్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. అతడి అపార అనుభవం, వ్యూహరచన, ఆటపై అవగాహన యువ ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ ధోనీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా విజయాలు, అపజయాల్లో కలిసి ప్రయాణించామని తెలిపారు. ధోనీ సీఎస్కే గుర్తింపులో ఎప్పటికీ భాగంగానే ఉంటాడని పేర్కొన్నారు.
