Sabarimala : శబరిమల భక్తులకు కేరళ సీఎం కీలక విజ్ఞప్తి.. అలాచేసి అపవిత్రం చేయొద్దు..!

Sabarimala : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ కీలక విజ్ఞప్తి చేశారు.

Sabarimala : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ కీలక విజ్ఞప్తి చేశారు. పవిత్ర పంబా నదిలో దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర వ్యర్థాలను పడేయవద్దని కోరారు. లక్షలాది మంది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసంతో ముడిపడి ఉన్న శబరిమల పవిత్రతను, పంబా నది పరిశుభ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.

Also Read : IND VS NZ 1st Test : న్యూజిలాండ్‌పై పంత్ విధ్వంసం.. సిక్సర్ల రికార్డు బద్దలు.. టెస్టుల్లో చారిత్రాత్మక ఘనత సొంతం!

శబరిమల అయ్యప్ప స్వామి వార్షిక మండల తీర్థయాత్ర ప్రారంభం కావడంతో కేరళలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ భక్తులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. శబరిమల ఆలయ పరిసరాలతో పాటు పవిత్ర పంబా నదిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరు భాషల్లో సందేశాన్ని విడుదల చేశారు. ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో భక్తులకు విజ్ఞప్తి చేశారు. ‘శబరిమల పవిత్రతను కాపాడండి.. పంబా నదిని పరిశుభ్రంగా ఉంచండి’ అంటూ పిలుపునిచ్చారు.

పంబా నది శబరిమల తీర్థయాత్రలో ఎంతో ముఖ్యమైన భాగమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే సమయంలో తమ దుస్తులను నదిలో వదిలేయడం, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర వ్యర్థాలను పడేయడం వంటి పనులు చేయకూడదని కోరారు. నది పవిత్రతను దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది నవంబర్ 17న శబరిమలలో మండల తీర్థయాత్ర ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రతకోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుమారు 1,000 మంది పారిశుద్ధ్య సిబ్బందితో ‘విశుద్ధి సేన’ను ఏర్పాటు చేసి పంబా, సన్నిధానం, నీలక్కల్ ప్రాంతాల్లో నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనవరిలో జరిగే మకరవిళక్కు ఉత్సవం వరకు ఈ సేవలు కొనసాగనున్నాయి.

మరోవైపు.. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 30వ తేదీ రకు వర్చువల్ క్యూ విధానం ద్వారా శబరిమలలో రోజుకు 5వేల మంది యాత్రికులకు అదనంగా దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అదనపు వర్చువల్ క్యూ బుకింగ్‌లు ప్రతిరోజూ అందుబాటులోకి రానున్నాయి. ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు, నవంబర్ 21, 22 తేదీలలో ‘స్పాట్ బుకింగ్’ (నేరుగా బుక్ చేసుకునే) అవకాశాలను కూడా పెంచాలని బోర్డు నిర్ణయించింది. తాము కోరుకున్న తేదీలలో వర్చువల్ క్యూ లేదా స్పాట్ బుకింగ్ స్లాట్లను పొందలేని యాత్రికులకు ఈ అదనపు ఏర్పాట్లు ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు. ఇంకా స్పాట్ బుకింగ్ స్లాట్లను పొందలేని భక్తులు ఈ అదనపు సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కోరింది.