Number Plate Fine : వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇలాచేస్తే ఇకనుంచి మీకు భారీ జరిమానా తప్పదు.. ఏఐతో నిఘా..

Number Plate Fine : నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసిన వాహనాలు పట్టుబడితే సాధారణ టోల్ ఛార్జీ కంటే నాలుగు నుంచి ఎనిమిది రెట్ల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Number Plate Fine

Vehicle Number Plate Tampering : వాహనదారులకు బిగ్ అలర్ట్.. కొందరు వాహనదారులు నంబర్ ప్లేట్లలోని కొన్ని అంకెలను కనిపించకుండా చేయడం లేదంటే నెంబర్ ప్లేట్ మార్చడం ద్వారా టోల్ చెల్లింపులను ఎగ్గొడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వాహనదారులపై భారీ జరిమానాలు విధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Also Read : Chittoor Robbery : చిత్తూరులో సినీ ఫక్కీలో దారి దోపిడీ.. కారును వెంబడించి రూ.20 లక్షలు దోచుకున్న దుండగులు!

జాతీయ రహదారులపై బారియర్‌లెస్ టోల్ విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహనాల నంబర్ ప్లేట్లను తారుమారు చేసి టోల్ చెల్లింపుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. కొందరు వాహనదారులు నంబర్ ప్లేట్లలోని కొన్ని అంకెలను దాచడం, మార్చడం ద్వారా టోల్ చెల్లింపులను ఎగ్గొడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది.

నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసిన వాహనాలు పట్టుబడితే సాధారణ టోల్ ఛార్జీ కంటే నాలుగు నుంచి ఎనిమిది రెట్ల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్ హైవే ఫీజు నిబంధనల్లో మార్పులు చేయాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ జరిమానాలు మోటారు వాహనాల చట్టం కింద విధించే శిక్షలకు అదనంగా ఉంటాయి. ప్రస్తుతం మోటారు వాహనాల చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌తో ట్యాంపరింగ్ చేసిన మొదటి తప్పిదానికి రూ.5,000 జరిమానా, ఆ తర్వాత ప్రతి ఉల్లంఘనకు రూ.10,000 జరిమానా విధించే నిబంధన ఉంది. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే టోల్ ఛార్జీల రూపంలోనూ అదనపు భారం పడనుంది.

నంబర్ ప్లేట్లను మార్చిన లేదంటే కనిపించకుండా చేసిన వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద తీసిన ఫొటోలు, ఇతర వివరాలను విశ్లేషించేందుకు ఏఐ సాంకేతికతను ఉపయోగించనున్నారు. ఈ వ్యవస్థను రానున్న రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఢిల్లీలోని ముండ్కా టోల్ ప్లాజా వద్ద బారియర్‌లెస్ టోల్ విధానం ప్రారంభమైన కొద్ది రోజులకే వాహనాల నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ సమస్య తెరపైకి వచ్చింది. దీంతో టోల్ ప్లాజాల వద్ద నిఘా పెంచాలని ఎన్‌హెచ్ఏఐ (NHAI) ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇతర ప్రాంతాల్లోనూ బారియర్‌లెస్ టోల్ విధానం విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది.