Aadhaar Card : ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. పుట్టిన తేదీపై హైకోర్టు సంచలన తీర్పు!

Aadhaar Card Date Of Birth Proof : ఆధార్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ ముఖ్యమైన విషయం ఇది. హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

aadhaar card

Aadhaar Card Date Of Birth Proof : ఆధార్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ ముఖ్యమైన విషయం ఇది. ఆధార్ కార్డులోని పుట్టిన తేదీనే నిజమని భావిస్తున్నారా? కానీ, ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అందులో నమోదైన పుట్టిన తేదీని జనన తేదీకి ఖచ్చితమైన ఆధారంగా పరిగణించలేమని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Also Read : NZ Vs IND : సిరాజ్ పేరు వల్లే తుది జట్టులో చోటు దక్కలేదా? కాంగ్రెస్, బీజేపీ నేతల మాటల యుద్ధం.. రంగంలోకి మాజీ క్రికెటర్లు..

ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని జనన తేదీకి ప్రామాణిక ఆధారంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ కార్డు అనేది వ్యక్తి గుర్తింపును ధ్రువీకరించే పత్రమే తప్ప.. పుట్టిన తేదీని నిర్ధారించే తుది సాక్ష్యం కాదని పేర్కొంది. ఉద్యోగి పదవీ విరమణ వయసుకు సంబంధించిన వివాదంలో ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఢిల్లీలోని జేజే ఎలక్ట్రానిక్స్ సంస్థలో 1981 నుంచి ఓ మహిళ పనిచేస్తున్నారు. 2017లో ఆమె వేతనాల పెంపు కోరిన నేపథ్యంలో యాజమాన్యంతో వివాదం ఏర్పడింది. అదే ఏడాది మే 20న ఆమెకు 58 ఏళ్లు నిండాయని, సంస్థలో అమల్లో ఉన్న పదవీ విరమణ నిబంధనల ప్రకారం ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని యాజమాన్యం పేర్కొంది. ఆమె ఆధార్ కార్డులో పుట్టిన తేదీ 1959 మే 20గా ఉండటంతో ఈ వాదన చేసింది. అయితే ఉద్యోగిని మాత్రం తన పుట్టిన తేదీ 1960 మే 20 అని, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) రికార్డుల్లోనూ అదే నమోదై ఉందని పేర్కొన్నారు. తనను అక్రమంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ కార్మిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన కార్మిక న్యాయస్థానం మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2010లోనే యాజమాన్యం సమర్పించిన వివరాల ఆధారంగా ఈఎస్ఐసీ రికార్డుల్లో ఆమె పుట్టిన తేదీ 1960 మే 20గా నమోదై ఉందని గుర్తించింది. ఆధార్ కార్డులోని తేదీని మాత్రమే ఆధారంగా తీసుకొని ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం చెల్లదని పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆధార్ చట్టం ప్రకారం ఇది గుర్తింపు ధ్రువీకరణకు ఉపయోగపడుతుందని, పుట్టిన తేదీకి తుది ఆధారంగా పరిగణించలేమని పేర్కొంది.

అంతకుముందు ఈఎస్ఐసీ రికార్డుల్లో మహిళ పుట్టిన తేదీని 1960గా నమోదు చేసిన యాజమాన్యం.. ఆ తర్వాత ఆధార్‌లోని మరో తేదీని చూపించి ఏడాది ముందుగానే ఉద్యోగం నుంచి తొలగించడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీంతో యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మహిళ ఉద్యోగం నుంచి తొలగించబడిన కాలానికి సంబంధించిన పూర్తి వెనుకటి వేతనాలు చెల్లించాలన్న కార్మిక న్యాయస్థానం ఆదేశాలను సమర్థించింది.