Trump Praises PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీపై ట్రంప్ ప్రశంసల వర్షం.. ఆయన చాలా ధైర్యవంతుడు, గొప్ప నాయకుడు అంటూ కితాబు!
Trump Praises PM Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.
- Harish Thanniru
- Updated on- November 17, 2026 / 07:03 PM IST
Trump Praises PM Modi
Trump Praises PM Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ చాలా ధైర్యవంతుడని, గొప్ప నాయకుడని అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు, గౌరవం ఉన్నాయంటూ కితాబు ఇచ్చారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన క్వాడ్ దేశాల నేతల సమావేశానికి ముందు గ్రూప్ ఫొటో దిగే సమయంలో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ తనకు మంచి మిత్రుడని, ఆయనతో తమకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.
క్వాడ్ కూటమిలో ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలు భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (Quad Summit) సమావేశంలో ఈ నాలుగు దేశాల అధినేతలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని సనాయే తకాయిచిలు పాల్గొన్నారు. నలుగురు నేతలు గ్రూప్ ఫొటో దిగారు. ఈ సమయంలో ట్రంప్ మాట్లాడుతూ ప్రధాని మోదీని ప్రశంసించారు. మోదీ వైపు చూపిస్తూ.. ఆయన చాలా ధైర్యవంతుడు అని వ్యాఖ్యానించారు. అనంతరం జపాన్ ప్రధాని సనాయే తకైచిని ఉద్దేశించి ఆమె కూడా మరింత ధైర్యవంతురాలై ఉండొచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా ప్రధాని వైపు చూస్తూ.. తామిద్దరం ఫర్వాలేదు అంటూ నవ్వుతూ చెప్పారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. మోదీ తనకు మంచి స్నేహితుడని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని, పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. క్వాడ్ కూటమి ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఈ సమావేశంలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల అధినేతలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని సనాయే తకైచి సమావేశమయ్యారు. ట్రంప్ ప్రస్తుత అధ్యక్ష పదవీకాలంలో నాలుగు దేశాల నేతలు పాల్గొన్న తొలి క్వాడ్ స్థాయి సమావేశం ఇదే. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, ఆర్థిక సహకారం, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ భేటీలో చర్చలు జరిగాయి.
నాలుగు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించేందుకు భవిష్యత్తులో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ సమావేశం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
