Road Accident : కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఆర్మీ కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Gujarat Road Accident : గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్మీ కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు.
- Harish Thanniru
- Published on- November 22, 2026 / 09:34 AM IST
Gujarat Road Accident
Gujarat Road Accident : గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు వేగంగా దూసుకొచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు.. ఇందులో మూడు నెలల పసికందు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతులంతా ఆర్మీ సిబ్బంది కుటుంబాలకు చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read : Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న భక్తుల వాహనం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది మృతి
కచ్ జిల్లాలో భుజ్ – ఖావడా జాతీయ రహదారిపై శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రణ్ ఆఫ్ కచ్ ప్రాంతాన్ని సందర్శించి తిరిగి భుజ్‌కు వెళ్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది.
మృతులు ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. భుజ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బంది కుటుంబ సభ్యులుగా అధికారులు వెల్లడించారు. మృతులను సౌరభ్ సింగ్ నేగి (30), ఆయన భార్య సవిత (30), వారి మూడు నెలల కుమార్తె శివిక, రాజేశ్ సింగ్ రావత్ (35), ఆయన ఏడేళ్ల కుమార్తె రక్షిత, రింకీ గోసాయ్ (30), ఆమె నాలుగేళ్ల కుమార్తె వామికగా గుర్తించారు. ఏడుగురి మృతదేహాలను భుజ్‌లోని ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు.
ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
