121 Kgs Gold Ornaments : తిరుమల శ్రీవారికి 121 కోట్లు ఇచ్చిన భక్తుడు ఎవరు? ఆయన ఫుల్ డిటెయిల్స్ ఇవే..

121 Kgs Gold Ornaments : టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయిలో బంగారు ఆభరణాలను కానుకగా ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇంత మొత్తంలో బంగారంను టీటీడీకి అందజేసిన వ్యక్తి ఎవరు..? ఆయన ఏం చేస్తారు..? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు.

121 kgs of gold ornaments for Lord Sri Venkateswara

121 Kgs Gold Ornaments : తిరుమల శ్రీవారికి 121కేజీలు కలిగిన 45 స్వర్ణాభరణాలు కానుకగా అందాయి. వీటి విలువ సుమారు రూ.200కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానంకు దాత ఈ ఆభరణాలను అందించారు. శ్రీవారి శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరించేలా కిరీటం, శంఖు చక్రాలు, కటివరద హస్తాలు, వడ్డాణం, పాదుకలు ఇలా 45 రకాల ఆభరణాలను ఓ జ్యూవెలరీ సంస్థ ద్వారా దాత తయారు చేయించారు. టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయిలో బంగారు ఆభరణాలను కానుకగా ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇంత మొత్తంలో బంగారంను టీటీడీకి అందజేసిన వ్యక్తి ఎవరు..? ఆయన ఏం చేస్తారు..? అనే విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

Also Read : Tirumala Gold Ornaments: తిరుమల శ్రీవారికి అలంకరించే స్వర్ణాభరణాలు ఇవే.. ఏ ఆభరణం ఎక్కడ దరింపజేస్తారంటే? వాటి ప్రత్యేకతలివే..

తిరుమల శ్రీవారికి 121కేజీల బంగారు ఆభరణాలను అందజేసిన దాత పేరు వర్ధమాన్ జైన్. ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త. చెన్నై కేంద్రంగా ప్రంపచ వ్యాపార రంగంలో తనదైన ముద్రవేసిన యాక్సెస్ హెల్త్‌కేర్ సహ వ్యవస్థాపకులు, వైస్ చైర్మన్. ఆయన వ్యాపార రంగంలో రాణిస్తూనే.. ఆధ్యాత్మికత, సమాజ హితం కోసం నిరంతరం పరితపించే వ్యక్తిగా గుర్తింపు పొందారు.

వర్ధమాన్ జైన్ చెన్నైలోని ప్రతిష్టాత్మక లయోలా కళాశాలలో స్టాటిస్టిక్స్ విభాగంలో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ (ఆస్టిన్) నుండి కంప్యూటర్ సైన్స్ లో పట్టా పొందారు. వర్ధమాన్ జైన్ గతంలో డెల్ సర్వీసెస్ బీపీవో విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్ గానూ పనిచేశారు. ఆ సమయంలో సంస్థను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. హెల్త్‌కేర్ బీపీవో రంగంలోకి అడుగుపెట్టి యాక్సెస్ హెల్త్‌కేర్ సంస్థను స్థాపించారు. ఎంటర్‌ప్రైజ్ ఆటోమేషన్ రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా, ఆసియా (చెన్నై) ఇంజనీరింగ్ సంస్థకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన విజన్ హెల్త్‌సోర్స్ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగానూ ఉన్నారు.

వర్ధమాన్ జైన్ ప్రముఖ వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. విద్య, వైద్య రంగాల్లోనూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీ సారితా జైన్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య సహాయం అందిస్తున్నారు. వెనుకబడిన యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఆవిష్కార్ సంస్థను కూడా స్థాపించారు. ఇలా వ్యాపార రంగంలో విజయాలు సాధిస్తూనే.. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు భారీగా విరాళాలు అందిస్తున్న వర్ధమాన్ జైన్ తిరుమల శ్రీవారికి భారీ కానుకతో వార్తల్లో నిలిచారు.

గతంలోనూ టీటీడీకి విరాళాలు..
వర్ధమాన్ జైన్ 2019 నుంచి టీటీడీకి పలు సందర్భాల్లో భారీ విరాళాలు అందిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో టీటీడీ రవాణా అవసరాల కోసం ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) అభివృద్ధి కోసం రూ.7 కోట్లను అందించారు. టీటీడీ ఆధ్వర్యంలోని గోశాలలో పశువుల దాణా తయారీకి ఉపయోగపడే మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశారు. అలాగే భక్తులు హుండీలో సమర్పించే కానుకలను సులభంగా వేరు చేసి లెక్కించేందుకు రూ.కోటి విలువైన నాణేల వేరు చేసే యంత్రాన్ని కూడా విరాళంగా అందించారు. చెన్నైలోని టీటీడీ ఆలయానికి కూడా గతంలో ఆయన విరాళాలు ఇచ్చారు.