Ap Rain Alert: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో 3 రోజులు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు(Ap Rain Alert) కురిసే అవకాశం ఉందని 10 జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Meteorological Department stated there is a possibility of heavy rains in ap for next three days.

Ap Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. గురువారం నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, వీటితో పాటు ఉరుములు, పిడుగులు, బలమైన ఈదురు గాలులు వీస్తాయని తన నివేదికలో తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాలపై ఈ వాతావరణ ప్రభావం ఉండనుండగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఐఎండి నివేదిక ప్రకారం పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

AP Panchayat Election: ఏపీ పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత.. అహోబిలంలో ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనంపై దాడి.. కారు అద్దాలు ధ్వంసం

పది జిల్లాలకు ఎల్లో అలర్ట్.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు:

వర్ష సూచన ఉన్న జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఈదురు గాలుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ హెచ్చరిక జారీ చేసినట్లు ఐఎండి పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షాలు(Ap Rain Alert) కురవని ఇతర జిల్లాల్లో సైతం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడొచ్చని అంచనా వేసింది. దీనివల్ల రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కొంత చల్లని వాతావరణం నెలకొనడంతో పాటు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఈదురు గాలుల ప్రభావం కనిపిస్తుందని తెలిపింది.

పిడుగుల ముప్పుపై ప్రత్యేక హెచ్చరిక.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన:

ఈ మూడు రోజుల పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ ఆశ్రయం పొందవద్దని హెచ్చరించింది. భారీ వర్షాలు పడకపోయినప్పటికీ ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఏర్పడినప్పుడు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఐఎండి అధికారులు సూచించారు.