Konaseema Gas Blowout: కోనసీమలో భారీ గ్యాస్ బ్లోఅవుట్.. ప్రజలను ఖాళీ చేయిస్తున్న సిబ్బంది.. 216 జాతీయ రహదారిపై రాకపోకలు బంద్!
కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ రీడ్రిల్లింగ్ పాయింట్ వద్ద భారీ గ్యాస్ బ్లోఅవుట్ (Konaseema Gas Blowout)సంభవించింది. అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Massive gas blowout at ongc redrilling point in konaseema district
Konaseema Gas Blowout: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున భారీ గ్యాస్ బ్లోఅవుట్(Konaseema Gas Blowout) సంభవించడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. గ్రామంలోని తాడివారి మెరక వద్ద ఉన్న ఓఎన్జీసీ (ONGC) రీడ్రిల్లింగ్ పాయింట్ నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున సీఎన్జీ గ్యాస్ లీకై, చుట్టుపక్కల గ్రామాలకు వేగంగా విస్తరిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే క్షేత్రస్థాయికి చేరుకున్న అధికార యంత్రాంగం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
రంగంలోకి బ్లోఅవుట్ కంట్రోల్ టీమ్.. వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు:
గ్యాస్ లీకేజీ తీవ్రత దృష్ట్యా బావి వద్ద మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా నీటిని చిమ్ముతూ ‘వాటర్ అంబ్రెల్లా’ను ఏర్పాటు చేశారు. మరోవైపు గ్యాస్ లీక్‌ను పూర్తిగా అరికట్టేందుకు నరసాపురం నుంచి ప్రత్యేక బ్లోఅవుట్ కంట్రోల్ నిపుణుల బృందం నగరం గ్రామానికి బయల్దేరింది. ముందుజాగ్రత్త చర్యగా 216 జాతీయ రహదారి బైపాస్‌పై వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.
