Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రి దుర్గగుడి అరుదైన రికార్డు.. భక్తుల సంతృప్తిలో టాప్.. వరుసగా ఐదోసారి అగ్రస్థానం!
ఐవీఆర్ఎస్ నివేదికలో 76.6 శాతం భక్తుల సంతృప్తితో విజయవాడ దుర్గగుడి(Indrakeeladri Temple) రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.
- V Santhosh Kumar
- Published on- November 29, 2026 / 10:43 PM IST
Indrakeeladri durga temple number one ivrs devotee satisfaction 76 6 percent november 2026
Indrakeeladri Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం భక్తుల సంతృప్తి స్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా సేకరించిన అభిప్రాయాల్లో 2026 నవంబర్ నెలకు సంబంధించి ఏకంగా 76.6 శాతం సంతృప్తి రేటింగ్ నమోదు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో వరుసగా ఐదోసారి అగ్రస్థానం దక్కించుకోవడం దేవస్థానం (Indrakeeladri Temple)పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుండగా, గత నెలతో పోలిస్తే సానుకూల స్పందన 3.4 శాతం పెరగడం భక్తుల విశ్వాసం మరింత బలపడుతున్నట్లు ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తోంది.
క్యూలైన్లు, ప్రసాదాలు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి: ఈవో శీనా నాయక్:
ఈ ఘనతపై స్పందించిన దుర్గగుడి ఈవో శీనా నాయక్, ఆలయ అధికారులు, సిబ్బంది సమష్టి కృషి, సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల క్రమబద్ధీకరణ, రుచికరమైన, నాణ్యమైన ప్రసాదాల తయారీ, ఆలయ పరిసరాల పరిశుభ్రత, తగినంత తాగునీటి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వివరించారు. నిరంతర పర్యవేక్షణతో సేవల ప్రమాణాలను మెరుగుపరుస్తూ భక్తులకు సంతృప్తికర అనుభూతిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
స్థలాభావ సవాళ్లను అధిగమిస్తూ ముందుకు.. సిబ్బందిలో హర్షం:
ఇటీవలి కాలంలో ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో ఆలయంలో స్థలాభావ సమస్యలు తలెత్తుతున్నాయని ఈవో శీనా నాయక్ వెల్లడించారు. అయినప్పటికీ పరిమితంగా ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ, అవసరమైన చిన్నచిన్న మార్పులు, తగిన ఏర్పాట్లతో ఆ సవాళ్లను అధిగమిస్తూ సేవలు కొనసాగిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేయగా, వరుసగా ఐదోసారి తొలి స్థానం లభించడంపై దేవస్థానం అధికారులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
