తెలంగాణ కుంభమేళా : మేడారంకు పోటెత్తిన భక్త జనం

Submitted on 5 February 2020
telangana kumbh mela medaram jatara starts

దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర...తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారక్క జాతర వైభవంగా ప్రారంభమయ్యింది.  ప్రతీ రెండేళ్లకోసారి మాఘమాసం వచ్చిందంటే చాలు.... ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్తూ జనసంద్రగా మారిపోతుంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్త జనులు పెద్దఎత్తున సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు.  నిజానికి అది పెద్ద ఊరు కాదు, చెప్పుకోదగ్గ పట్ణణమూ కాదు. అదొక కీకారణ్యం. అక్కడక్కడ కొన్ని ఇళ్లు తప్ప పెద్దగా జనం లేని కారడవి.


ప్రతి రెండేళ్లకోసారి అక్కడో మహానగరం వెలుస్తుంది. అక్కడి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ జనసంద్రం ఆవిర్భవిస్తుంది. అదే మేడారం జాతర. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. ఈ ఏడాది 2020లో  ఫిబ్రవరి 5వ తేదీ నుండి 8వతేదీ వరకు జాతర జరుగుతుంది. తెలంగాణా కుంభమేళగా, ప్రపంచంలో అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ జాతరకు కోటి 40 లక్షల మందికి పైగా జనం హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 
 

బుధవారం ఫిబ్రవరి 5 సాయంత్రం సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలపైకి రావడంతో మహా జాతర ప్రారంభమవుతోంది. వనదేవతల వారంగా భావించే బుధవారం రోజున.. మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడతారు. 4 ప్రాంతాల్లోనూ వనదేవతల పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర లాంఛనంగా మొదలవుతోంది.  అర్రెం వంశీయుల ఆరాధ్య దైవం, సమక్క భర్త అయిన పగిడిద్దరాజు సోమవారం ఫిబ్రవరి3న మేడారానికి పయనమయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామం నుంచి అర్రెం వంశీయులు కాలినడకన పగిడిద్దరాజును తీసుకుని బుధవారం సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. 
 

సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు 3 కిలోమీటర్ల దూరం లోని ఈ కుగ్రామంలో చిన్న ఆలయంలో ప్రతిష్టించబడిన సారలమ్మ ఫిబ్రవరి 5న బుధవారం సాయంత్రం మేడారం లోని గద్దె వద్దకు చేరుతుంది. సారలమ్మ జంపన్నవాగు గుండా నేరుగా మేడారంలోని తల్లి సమ్మక్క దేవాలయానికి చేరుకుంటుంది. 
 

సారలమ్మ కొలువుదీరిన మరుసటి రోజున అంటే 6న గురువారం సాయంత్రం వేళ సమ్మక్క గద్దెపైకి వస్తుంది. ఆ రోజు ఉదయమే పూజారులు చిలకలగుట్టకు వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై పూజలు చేస్తారు. అనంతరం సమ్మక్క పూజామందిరం నుంచి వడరాలు, పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. సాయంత్రం వేళలో చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. జాతర మొత్తానికి ప్రధానమైన సమ్మక్క ఆగమనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తల్లికి ఆహ్వానం పలు కుతూ చిలకలగుట్ట వద్దకు వెళ్తారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు అక్కడ పూజలు చేస్తారు. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన పూజారి మైకంతో పరుగున గుట్ట దిగుతాడు. అక్కడ పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేస్తారు. జిల్లా ఎస్పీ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి అధికార వందనంతో స్వాగతం పలుకుతారు. 
 

గద్దెలపై ఆశీనులైన సమ్మక్క–సారలమ్మ జాతరలో మూడో రోజు (7వ తేదీ) భక్తులకు దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. కోర్కెలు తీరినవారు కానుకలు చెల్లిస్తారు.  కనులారా వీక్షించి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన అశేష భక్తజనానికి దర్శనం ఇచ్చిన సమ్మక్క–సారలమ్మ నాలుగో రోజున (8 శనివారం) సాయంత్రం తిరిగివన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగిసిపోతుంది.
 

ఈ ఏడాది జరిగే మేడారం జాతరకు ప్రభుత్వం రూ.75 కోట్లను కేటాయించింది. వీటిని జాతరలో తాత్కాలిక, శాశ్వత ఏర్పాట్ల కోసం వివిధ శాఖలకు కేటాయించింది. వాటిలో  రోడ్లు భవనాల శాఖకు: రూ.8.05 కోట్లు, పంచాయితీ రాజ్ శాఖకు: రూ. 3.50కోట్లు,ఇరిగేషన్ శాఖ: రూ. 4 కోట్లు,గిరిజన సంక్షేమం: రూ. 4 కోట్లు. గ్రామీణ నీటి సరఫరా, శానిటేషన్‌కు: రూ.19 కోట్లు. జిల్లా పంచాయితీ అధికారి: రూ. 3.65 కోట్లు.ఎండోమెంటుకు: రూ.3 కోట్లు, ఎం.పీ.డీ.సి.ఎల్‌కు : రూ.4 కోట్లు. టీ.ఎస్‌ఆర్టీ.సికి: రూ. 2.48 కోట్లు.  ఫైర్ సర్వీసులుకు: రూ. 21 లక్షలు.వైద్య, ఆరోగ్య శాఖకు: రూ. 1.46 కోట్లు. పోలీసు శాఖకు: రూ. 11 కోట్లు.రెవిన్యూ శాఖకు: రూ. 7 .50కోట్లు.అటవీ శాఖకు: రూ.10 లక్షల చొప్పున కేటాయించారు.
 

సుప్రసిద్ధ మేడారం జాతరకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 20 ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. జాతర సందర్బంగా మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కోట్లాది మంది ప్రజలు వన దేవతలను దర్శించుకుని తరిస్తున్నారు.  ఈ ఏడాది రాష్ట్ర  ప్రభుత్వం టూరిజం అభివృధ్దిలో భాగంగా మేడారం కు  హెలికాప్టర్ సర్వీసులను కూడా ప్రారంభించింది. 

Telangana
Medaram Jatara (13908
Sammakka Sarakka
Sammakka Saralamma Jathara
Warangal District
Mulugu District

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు