భయం నా బ్లడ్‌లో లేదు : కేశినేని నాని మరో సంచలన పోస్టు

Submitted on 12 June 2019
Tdp mp kesineni nani facebook post

కొద్ది రోజులుగా అసంతృప్తితో రగిలిపోతున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని.. సోషల్‌ మీడియా వేదికగా వరుస పోస్టులతో సొంత పార్టీ నేతలపై పరోక్షంగా విరుచుకుపడుతున్నారు. తాజాగా ఫేస్ బుక్ లో ఆయన మరో పోస్టు పెట్టారు. తాను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తినని.. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదని స్పష్టం చేశారు. నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం, ప్రజాసేవే తన నైజమని తెలిపారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం మాత్రమే తెలిసినవాడినని చెప్పారు. రాష్ట్రం కోసం లోక్‌సభలో ప్రధాని మోడీని నిలదీసినవాడిని అని గుర్తు చేశారు.

భయం తన రక్తంలోనే లేదన్నారు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదన్నారు. ఎవరెన్ని విపరీతార్థాలు తీసినా లెక్కచేయను అని తేల్చి చెప్పారు. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను అనే సుదీర్ఘ పోస్ట్‌ను ఫేస్ బుక్ లో నాని పెట్టారు.

టీడీపీ నేత దేవినేని ఉమ తీరుపట్ల నాని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ చీఫ్ చంద్రబాబు ఇచ్చిన లోక్‌సభ విప్‌ పదవిని సైతం తిరస్కరించి తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. నాని తీరు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన టీడీపీనీ వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే మంత్రి కొడాలి నానిపైనా ఆసక్తికర పోస్టు చేశారు కేశినేని నాని. మంత్రి పదవి దక్కేలా చేసిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమకు.. కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలన్నారు. కేశినేని పెట్టిన ఈ పోస్టు టీడీపీలో తీవ్ర దుమారమే రేపింది. కేశినేని నాని.. దేవినేని ఉమను .. ఇరుకునే పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఈ వివాదం ఎటు దారితీస్తుందో, దీనిపై పార్టీ చీఫ్ చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Kesineni Nani
TDP
vijayawada
Devineni Uma
Facebook
Chandrababu
Kodali Nani

మరిన్ని వార్తలు