చంద్రబాబుకి షాక్ ఇస్తారా : చిరంజీవితో కలిసి సీఎం జగన్ ని కలవనున్న టీడీపీ ఎమ్మెల్యే

Submitted on 14 October 2019
tdp mla to meet cm jagan with chiranjeevi

ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ కానున్నారు. జగన్‌ను కలిసేందుకు చిరంజీవి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో చిరుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లికి బయల్దేరిన చిరంజీవి దంపతులు... అక్కడ సీఎం జగన్‌తో లంచ్‌ మీటింగ్‌లో పాల్గొంటారు.

మధ్యాహ్నం 1.30 గంటకు జగన్‌, చిరంజీవి మధ్య లంచ్‌ మీటింగ్‌ జరగనుంది. ఇరు వర్గాలు మర్యాదపూర్వక సమావేశమే అంటున్నప్పటికీ సినీ, రాజకీయ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ సీఎం అయిన తర్వాత టాలీవుడ్ నుంచి బడా స్టార్స్ ఎవరూ ఆయనను మర్యాదపూర్వకంగా కూడా కలవలేదంటూ వైసీపీ నేతలు విమర్శించారు. టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదని ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి విమర్శల నేపథ్యంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి జగన్‌ను కలవనుండటంతో అటు టాలీవుడ్‌తో పాటు ఇటు రాజకీయ వర్గాలు కూడా ఈ పరిణామాలను ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. సైరా నరసింహారెడ్డి సినిమాను వీక్షించాలని కోరేందుకే జగన్‌ను చిరంజీవి కలుస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలాగే.. ఏపీలో సైరా మూవీకి స్పెషల్ షోలు వేసేందుకు అనుమతి ఇచ్చినందుకు.. సీఎం జగన్‌ను కలిసి చిరంజీవి ధన్యవాదాలు చెప్పనున్నారు.

సైరా సినిమా గురించి మాత్రమే జగన్‌తో భేటీ అవుతున్నట్లు చిరంజీవి కూడా క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ.. వీళ్లిద్దరూ తాజా రాజకీయాలపై కూడా చర్చిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ఈ వ్యవహారంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. చిరంజీవి వెంట మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా సీఎం జగన్‌ను కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడీ న్యూస్ టీడీపీతో పాటు రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. కొంతకాలంగా గంటా పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో జగన్‌‌తో భేటీ కానున్నారనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. గంటా శ్రీనివాసరావు చంద్రబాబుకి షాక్ ఇస్తారా... వైసీపీలో చేరతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

cm jagan
Chiranjeevi
ganta srinivas rao
TDP
Politcs
Chandrababu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు