మండే రోజులు వచ్చేశాయి : 37డిగ్రీలు దాటిన టెంపరేచర్

Submitted on 21 February 2019
Summer Heat Gradually Increasing In Telananga

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత బాగా పెరిగింది. ఇప్పుడే ఈ రేంజ్ లో ఎండలు ముదిరితే.. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి ప్రభావం తగ్గి వారం గడిచిందో లేదో ఎండవేడిమి, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో 36 నుంచి 37 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోని పశ్చిమ భాగం నుంచి గాలులు తగ్గిపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు వాతావరణ శాఖ అధికారులు  చెబుతున్నారు.

 

బుధవారం(ఫిబ్రవరి-20-2019) మధ్యాహ్నం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అత్యధికంగా 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా బోదన్‌, కామారెడ్డి జిల్లా  లింగంపేటలో 37.6, సికింద్రాబాద్‌లో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37డిగ్రీలను దాటింది. రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల నమోదైంది.  మంగళవారం(ఫిబ్రవరి-19-2019) రాత్రి నిజామాబాద్‌లో సాధారణం కన్నా 5 డిగ్రీలు, హైదరాబాద్‌లో 2 డిగ్రీలు అధికంగా నమోదు కావడంతో ఉక్కపోత పెరిగింది.

 

రాష్ట్రానికి దక్షిణ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వల్ల వేడి తీవ్రత కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2018తో పోలిస్తే 2019లో ఎండల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 2016, 17 సంవత్సరాల్లో నమోదైన స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నారు. 2016లో 27రోజుల పాటు, 2017లో 23రోజుల పాటు వడగాల్పులు వీచాయి. 2019లో కూడా ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీలను తాకొచ్చని హెచ్చరించారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు జనాలకు చెమట్లు పట్టిస్తున్నాయి. ముందు ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని హడలిపోతున్నారు.

heat waves
temperatures
Summer
sun
Telangana
Hyderabad
day temperatures increase

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు