మండుతున్న ఎండలు : వామ్మో కూరగాయలు

Submitted on 16 May 2019
Summer Effect Vegetable Prices Hike Due To Summer

ఓ వైపు ఎండలు మండుతున్నాయి..మరోవైపు కూరగాయల ధరలు సుర్రుమంటున్నాయి. ధరలు భగ్గుమంటున్నాయి. రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు తోడు కూరగాయల ధరలూ ఆకాశాన్నంటడంతో సామాన్య మానవులు బేంబెలెత్తుతున్నారు. పెరిగిన ధరలతో ఏమి కొనాలో అర్థం కావడం లేదు జనాలకు.  ధరలు కుతకుత ఉడుకుతూ సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. టమాట మోత మోగిస్తుంటే చిక్కుడు చికాకు పెడుతోంది. పచ్చిమిర్చి మరింత ఘాటు ఎక్కితే బీన్స్ బెంబేలెత్తిస్తోంది. నగరంలో కూరగాయల ధరలు మండుతున్నాయి.

ఎండలు మండిపోతుండటం..నీటి కొరతతో కూరగాయల ఉత్పత్తి పడిపోవడం కారణమంటున్నారు. ఈ ధరలు నగరంలోని ఏ ఒక్క మార్కెట్‌కు పరిమితం కాలేదు. మెహిదీపట్నం, మోండా మార్కెట్, గుడి మల్కాపూర్..ఏ మార్కెట్‌కు వెళ్లినా ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. భూగర్భ జలాలు అటుగండిపోతుండడం..కూరగాయల సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. పొరుగు రాష్ట్రాల నుండి కూరగాయల దిగుమతి సైతం తగ్గిపోయింది. దీంతో వినియోగదారుడిపై ధరాభారం పెరుగుతోంది. ధరల పెరుగుదల జులై దాక కొనసాగే ఛాన్స్ ఉందని మార్కెటింగ్ శాఖలు అంచనా వేస్తున్నాయి.

నష్టాల భయంతో రైతులు కూరగాయల సాగుకు దూరంగా ఉంటున్నారు. సాగు సీజన్‌గా పేర్కొనే అక్టోబర్ - ఫిబ్రవరి మధ్య రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో కూరగాయాలు సాగవుతాయని ఉద్యానవన శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే..ప్రస్తుతం కూరగాయాల సాగులో ఆఫ్ సీజన్ కొనసాగుతుండడంతో సాగు విస్తీర్ణం అమాతం పడిపోయింది. వికారాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

హోల్ సేల్ మార్కెట్ ధరలు (కిలో ధర రూ. లలో)

కూరగాయాలు ప్రస్తుతం ఈనెల 9న
బెండకాయ రూ. 22-25 రూ. 20-25
టమాట రూ. 34-44 రూ. 24-30
వంకాయ రూ. 14-18 రూ. 20-25
పచ్చిమిర్చి రూ. 45-20 రూ. 40-50
దొండకాయ రూ. 15-18 రూ. 12-15
కాకరకాయ రూ. 30-35 రూ. 28-35
క్యాప్సికం రూ. 25-30 రూ. 18-21

హైదరాబాద్ జంట నగరాల్లో వినియోగించే కూరగాయాల్లో 60 శాతం వరకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. టమాట, పచ్చిమిర్చి, బెండ, దొండకాయ, బీరకాయ వంటి కూరగాయాలు ఈసారి ఇతర ప్రాంతాల నుండి దిగుమతి కాకపోవడం ధరల పెరుగుదలకు కారణమౌతోంది. హోల్ సేల్ మార్కెట్‌కు టమాటలు 400 పెట్టెలు కూడా మించడం లేదు. గతంలో నిత్యం 4 వేల పెట్టెల టమాటలు వచ్చేవని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఏపీ నుండి వచ్చే టమాట, పచ్చిమిర్చి సైతం నిలిచిపోయిందంటున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా వ్యాపారుల నుండి రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఇతర కూరగాయాల దిగుమతుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వారం వ్యవధిలోనే కూరగాయాల ధరలు బయటి మార్కెట్లో కిలోకు రూ. 5 నుంచి రూ. 20 వరకు పెరిగాయి.

 

summer effect
Vegetable
prices hike
Summer

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు