students-parents-thanks-cm-jagan-parents

‘జగనన్న విద్యాదీవెన’ మా కుటుంబాలను కాపాడుతుంది, సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ సీఎం జగన్‌ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం(ఏప్రిల్ 28,2020) ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. పలు జిల్లాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సీఎం అన్నారు. ఇంతకు ముందు తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం తీసుకువచ్చారని.. అంతవరకూ ఎవరూ కూడా దీని గురించి ఆలోచన చేయలేదని సీఎం జగన్‌ గుర్తుచేశారు.

బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకోచ్చామని తెలిపారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 4 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్‌మెంట్‌ అందజేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,880 కోట్ల బకాయిలను కాలేజీలకు చెల్లించారు. 

అప్పుల పాలు కాకుండా పెద్ద చదువులు చదివితేనే పేదవాళ్ల తలరాతలు మారుతాయి:
పెద్ద చదువులు చదవగలిగితేనే పేదరికం పోతుందని, అప్పుల పాలు కాకుండా పెద్ద చదువులు చదివితేనే పేదవాళ్ల తలరాతలు మారుతాయని, బతుకులు మారుతాయని నాన్నగారు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో నాన్నగారు ఉన్నప్పుడు ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ పూర్తి భరోసా ఉండేది. సీఎం స్థానంలో మనసున్న మహారాజు ఉండేవాడని ఒక భరోసా ఉండేది. ఆయన చనిపోయాక ఈ పథకాన్ని పూర్తిగా నీరుగారుస్తూ పోయారు. చాలీచాలని ఫీజులు ఇవ్వడం, ఇచ్చామంటే ఏదో ఇచ్చామన్నట్లుగా ఇవ్వడం చేశారు. ఫీజులు ఎలా ఇవ్వాలన్న ఆలోచన కాకుండా ఎలా కత్తిరించాలి.. అని ఆలోచన చేసి.. చాలీచాలని ఫీజులు ఇచ్చారు. చదువుల కోసం, ఆరోగ్యం కోసం పేదవాడు అప్పులు పాలు అవుతున్నాడని వాపోయారు.

ఆ డబ్బును కాలేజీ యాజమాన్యాలు వెనక్కి ఇవ్వాలి:
కరోనా లాంటి కష్టాలు ఉన్నా.. మా ఇబ్బందుల కన్నా.. మీ ఇబ్బందులు పెద్దవి అని భావిస్తున్నాం. గడచిన సంవత్సరాల్లో అడ్మిషన్లు తీసుకున్న వారే కాకుండా.. పై తరగతులు చదువుతున్న వారికి కూడా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింప చేస్తున్నాం. స్పెషల్‌ ఫీజులు.. ఇతరత్రా ఫీజులు కూడా ఉండవు. ఎవరైనా తల్లిదండ్రులు.. ఇప్పటికే కాలేజీలకు ఫీజు కట్టి ఉంటే.. ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి.. ఆ డబ్బను తల్లిదండ్రులకు వెనక్కి ఇవ్వాలి. తల్లిదండ్రులకు లేఖలు కూడా రాశాం… గ్రామ వాలంటీర్ల ద్వారా అవి చేరుతాయి.

ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యాలకు కూడా చెప్పడం జరిగింది. లేకుంటే 1902 నంబర్‌కు తల్లిదండ్రులు తమ సమస్యను చెప్పవచ్చు. కాలేజీల్లో సదుపాయాలు, మౌలిక వసతులు సరిగ్గా లేవని భావిస్తే 1902 కు తల్లులు కాల్‌ చేయవచ్చు. ఉన్నత విద్యా శాఖలో కాల్‌ సెంటర్‌ ఉంటుంది, సీఎం కార్యాలయం పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఏ సమస్యలున్నా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. మీ పిల్లలను గొప్పగా చదివించండి. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఈ స్థానంలో ఉన్నాడు. మీ పిల్లలను అన్ని రకాలుగా చదివిస్తానని హామీ ఇస్తున్నా. దేవుడి దయతో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా’ అని జగన్ తెలిపారు. 

సీఎం జగన్ తో విద్యార్థిని తల్లి(విశాఖపట్నం):
‘మీరు ప్రవేశపెట్టిన పథకాలు మా కుటుంబాలను కాపాడుతున్నాయి. మా అమ్మాయికి దీని వల్ల మేలు జరుగుతుంది. జగనన్న మమ్మల్ని దీవిస్తారులే అని మా అమ్మాయి చెప్తూ ఉంటుంది. మహిళల పట్ల మీకు అమితమైన గౌరవం ఉంది. మీరు ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, గోరుముద్ద కూడా చాలా మంచి పథకాలు’.

రత్నకుమారి, విద్యార్థిని(విజయవాడ):
‘మా కుటుంబాల్లో ఆర్థికంగా చాలా సమస్యలున్నాయి. మాకు ముగ్గురు పిల్లలు. నా భర్త వెన్నుకు ఆపరేషన్‌ జరిగింది. ఇప్పుడు పూర్తి బెడ్‌ రెస్ట్‌. ట్యూషన్లు చెప్పే దాన్ని. చాలా ఇబ్బందులు పడ్డాను. చదువులు లేకపోతే ఇబ్బందేముంది అని నా పిల్లలు అనేవాళ్లు. నేను ఏడవని రోజు అంటూ లేదు. నా పిల్లలు అందరికీ మీ వల్ల మేలు జరుగుతుంది. కరోనా వంటి ఆపద సమయంలో కూడా వాలంటీర్లు ఇంటింటికీ వస్తున్నారు. వేయి రూపాయలు కూడా ఇచ్చారు. ఇంటి నుంచి బయటకు రాని సమయంలో కూడా ఆదుకున్నారు. అందుకు మీకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నా.. మీరు కాల్‌ సెంటర్‌ పెట్టి నంబర్‌ కూడా ఇచ్చారు కాబట్టి, ఇక ఏ సమస్యలూ ఉండవు. మద్యపాన నియంత్రణ వల్ల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. రోజూ రూ.200 నుంచి రూ.250 వరకు ఖర్చు పెట్టి మద్యం తాగే వాళ్లు. ఇప్పుడు ఇదే డబ్బును ఆదా చేసుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు’.

ఉమాశంకర్‌రెడ్డి, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాల ప్రతినిథి(గుంటూరు):
‘ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇబ్బందులను పాదయాత్రలో మీ దృష్టికి తీసుకొచ్చాం. ఆరోజే మీరు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హామీ ఇచ్చారు. కరోనా లాంటి సమయంలో కూడా మీరు ధైర్యం చేసి ఇంత పెద్ద మొత్తాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇస్తున్నారు. విద్యకు మీరు ఇచ్చే ప్రాధాన్యత దీని ద్వారా తెలుస్తుంది. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించక పోవడం వల్ల చాలా కాలేజీలు మూతబడే పరిస్థితి. స్కిల్‌ డెవలప్‌మెట్‌ రూపంలో కూడా మీరు కొత్త కొత్త సంస్కరణలు తీసుకు వస్తున్నారు’.