ఆందోళనలో పాల్గొన్న రాహుల్, సోనియా

Submitted on 11 July 2019
Sonia, Rahul Gandhi Join Protests After Karnataka, Goa Congress Meltdown

కర్ణాటక, గోవాలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ఆరోపిస్తూ ఇవాళ(జులై-11,2019) కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ ప్రాంగణంలో నిరసనకు దిగారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సహా పార్టీ సీనియర్‌ నేతలు పార్లమెంట్‌ ప్రాంగంణంలోని గాంధీ విగ్రహం దగ్గర నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అంటూ ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు

కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాతో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ డబ్బు ఆశ చూపిస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. సంకీర్ణానికి సంఖ్యా బలం లేదని, సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమయంలో ముంబైలో ఉంటున్న 10మంది రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ పై ఇవాళ(జులై-11,2019)ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇవాళ సాయంత్రం 6గంటల్లోగా  రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరుకావాలని,రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఇవాళ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. అయితే సుప్రీం ఆదేశాన్ని సవాల్ చేస్తూ...తనకు ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలంటూ స్పీకర్ కేఆర్ రమేష్ వేసిన పిటిషన్ న్ పై ఇవాళ విచారణ జరిపేందుకు సుప్రీం నిరాకరించింది. రెబల్ ఎమ్మెల్యేలు అందరూ ఇప్పటికే ముంబై నుంచి బెంగళూరుకి బయల్దేరారు. దీంతో కర్ణాటక రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి.


 ఇదిలా ఉండగా..గోవాలో 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సంఖ్యా బలం ఐదుకు పడిపోయింది. బుధవారం(జులై-10,2019)రాత్రి గోవా ప్రతిపక్ష నాయకుడితో సహా 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ని కలిసి సీఎల్పీని బీజేపీలో విలీనం చేయాలని కోరారు.

karnataka
Goa
BJP
Congress
Protest
Rahul
Sonia Gandhi
join
MELT DOWN


మరిన్ని వార్తలు