దైవ సాక్షిగా: ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం

Submitted on 17 January 2019
Six Women MLAs sworn in Telangana Assembly Today

హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత వరుసగా సభలో ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా మహిళా ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఆరుగురిలో ఇద్దరు ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయగా.. మిగతా నలుగురు తెలుగులో ప్రమాణం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి గెలిచిన అజ్మీర రేఖానాయక్(టీఆర్‌ఎస్) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి ఎన్నికైన హరిప్రియ నాయక్ బానోతు(కాంగ్రెస్) ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. వరంగల్ జిల్లా మలుగు నుంచి ఎన్నికైన డి.అనసూయ(సీతక్క)(కాంగ్రెస్) ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా.. నల్గొండ జిల్లా ఆలేరు నుంచి ఎన్నికైన గొంగిడి సునీత(టీఆర్‌ఎస్) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మెదక్ జిల్లా నుంచి ఎన్నికైన పద్మా దేవేందర్ రెడ్డి(టీఆర్‌ఎస్), రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నుంచి ఎన్నికైన సబితా ఇంద్రారెడ్డి(కాంగ్రెస్) వరుసగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. 

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా కొలువుదీరింది. ఈసారి సభలో సీనియర్ ఎమ్మెల్యే కేసీఆర్ ఉండగా, వనమా వెంకటేశ్వరావు(73) సీనియర్ సభ్యుడిగా ఉన్నారు. వనమా వెంకటేశ్వరావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. సభలో అందరికి కంటే అత్యంత పిన్న వయసు బానోతు హరిప్రియది. ఆమె వయసు 29 సంవత్సరాలు. ఇల్లందు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన హరిప్రియ బానోతు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

Woman MLAs
Telangana Assembly
KCR
Swor in Assembly

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు