ఐసీయూలో అగ్నిప్రమాదం : షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రి సీజ్, ఎండీ అరెస్ట్

Submitted on 21 October 2019
shine hospital md arrest

ఐసీయూలో అగ్నిప్రమాదం నేపథ్యంలో షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై 304 ఏ కింద కేసు నమోదు చేశారు. షైన్ ఆస్పత్రిపైనా ఎల్బీ నగర్ పోలీసులు కేసు బుక్ చేశారు. షైన్‌ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సోమవారం (21.10.2019) అగ్నిప్రమాదం జరిగింది. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఊపిరి ఆడక ఓ చిన్నారి మృతి చెందగా.. పలువురు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 42మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రి ఎదుట బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ఘోరం జరిగిందన్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అని మండిపడ్డారు. షైన్ ఆస్పత్రిని పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. షైన్ ఆస్పత్రి యాజమాన్యం ఏడాదిగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తెలిసింది. ఫైర్ సేఫ్టీ ఎన్వోసీని రెన్యువల్ చేయించలేదని బయటపడింది.

సోమవారం తెల్లవారుజామున 4వ అంతస్తులోని ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ చిన్నారి మృతి చెందింది. చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్‌ సేఫ్టీ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయకుండానే డాక్టర్‌ సునీల్‌ ఆస్పత్రిని నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో 304A సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఆస్పత్రిని సీజ్‌ చేశారు. ఆస్పత్రి యాజమాన్యం వైఖరికి నిరసనగా, బాధితులను ఆదుకోవాలంటూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. షైన్‌ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రి ఘటనపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అగ్నిప్రమాద ఘటనపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Shine Hospital
md arrest
LB Nagar
Hyderabad
Fire Accident

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు