మేడమ్ చొరవ చూపండి : గవర్నర్ ని కలిసిన ఆర్టీసీ జేఏసీ నేతలు

Submitted on 21 October 2019
rtc jac leaders meet governor

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ తమిళిసైని కలిశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ఇతర నేతలు సోమవారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసి ఆర్టీసీ సమ్మెపై వివరించారు. సమ్మెపై చొరవ చూపాలని గవర్నర్ ని కోరారు. సమ్మెకు సంబంధించి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకపోవడం, కార్మికుల పరిస్ధితిపై తమిళిసైకి వివరించారు. ప్రైవేట్‌ టాక్సీ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చూపిన చొరవ .. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనూ చూపాలని గవర్నర్‌ను కోరారు. కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తో చర్చించారు. తమ సమస్యలను గవర్నర్ కి ఏకరువు పెట్టారు. 

సమ్మె నోటీసు డిమాండ్లను గవర్నర్ కు వివరించినట్టు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలపై ప్రభుత్వం కోర్టుకి తప్పుడు నివేదిక ఇచ్చిందని గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. మంగళవారం(అక్టోబర్ 22,2019) జూబ్లీ బస్టాండ్ లో వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సింగరేణి కార్మికుల మద్దతు కూడా కోరతామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఆర్టీసీని లాకౌట్ చేయడానికి కేసీఆర్ ఎవరు అని అశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నానికి అడ్డుకుట్ట వేసేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. విధుల్లోకి రావాలని ఆర్టీసీ కార్మికులను ఓ ఎమ్మెల్యే ప్రలోభపెడుతున్నారని ఆరోపించిన అశ్వత్థామరెడ్డి.. సమ్మె యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ ని కలవడం ఆసక్తికరంగా మారింది. జేఏసీ నేతలతో మాట్లాడిన గవర్నర్... ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇస్తారు అనేది ఉత్కంఠగా మారింది. కాగా, ఇప్పటికే గవర్నర్ తమిళిసై.. ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి ఓ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ నేతలు.. ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.

ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. అక్టోబర్ 22న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు.. ఆర్టీసీ కార్మికుల పొట్టకొట్టొద్దని విజ్ఞప్తి చేస్తామన్నారు. రూ.1000, రూ.1500కి ఆశపడి తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నవారు.. 22వ తేదీ నుంచి విధులకు దూరంగా ఉండాలన్నారు. ప్రజా రవాణాను ప్రైవైటీకరించకుండా తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరతామన్నారు.

అలాగే 23వ తేదీన ప్రజా ప్రతినిధులతో ములాఖత్ ఉంటుందని తెలిపారు. 24న మహిళా కండక్టర్లంతా ఆర్టీసీ డిపోల ఎదుట దీక్షలు చేపడతారని చెప్పారు. 25న హైవేలపై బైఠాయించి దిగ్భంధం చేస్తామన్నారు. 26న ఆర్టీసీ కుటుంబాల పిల్లలతో దీక్షలు చేపడతామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆర్టీసీ పోరాటాన్ని ఆపేది లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.

governor tamilisai
RTC JAC
Telangana
CM KCR

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు