వారికి కాసులు వీరికి కష్టాలు : నష్టాల్లో ఆదిలాబాద్ పత్తి రైతులు

Submitted on 21 February 2019
Report On Adilabad Cotton Farmers Problems

ఉత్తర తెలంగాణలో అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తున్న రైతుల కష్టాలు తీరవా ? నష్టాల్లోనే కొనసాగాలా ? ఈసారి కూడా రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం...వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు కుమ్మక్కు కావడమే. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధర రాక దిగాలు పడిన రైతన్నలు.. సీసీఐ ద్వారా 5,450రూపాయల ధర లభిస్తున్నా.. దానిని పొందలేక 5,300 రూపాయలకే తెగనమ్ముకోవలసి వస్తోంది. దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే చదవండి...

రైతులు పండించిన పంటను దళారులు నేరుగా జిన్నింగ్‌ మిల్లులకు విక్రయిస్తున్నారు. అడ్డుకట్ట వేసేందుకు అధికారులెవరూ సాహసించడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 963 మంది ట్రేడర్లు ఉండగా.. అందులో 590 మంది కమీషన్‌ ఏజెంట్లే ఉన్నారు. ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులోనే 292 మంది కమీషన్‌ ఏజెంట్లు ఉండగా.. ఇచ్చోడలో 41 మంది, బోథ్‌లో 25 మంది, జైనథ్‌లో 24 మంది కమిషన్‌ ఏజెంట్లు ఉన్నట్లు మార్కెట్‌ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ కమిషన్ల ఏజెంట్లు మిల్లుల నిర్వాహకులతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏజెంట్ల నుంచి రైతులు అప్పులు తీసుకోవడంతో వారికే పంట విక్రయించాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు.

క్వింటాల్‌కు 5,450 రూపాయలు సీసీఐ ఇస్తే...ప్రైవేట్‌ వ్యాపారులు మాత్రం 5,300 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. అప్పు తీసుకున్న పాపానికి వారికే పత్తి విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు ప్రైవేట్‌ వ్యాపారులు 10 లక్షల 77 వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా.. సీసీఐ మాత్రం కేవలం 92, 425 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసిందంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. పలువురు అధికారులే ప్రైవేట్‌ వ్యాపారులకు పత్తి విక్రయించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.  అడ్డంగా దోచుకుంటున్న దళారీలపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఆరుగాలం శ్రమించి తాము పంట పండిస్తే మధ్యలో ఉన్న దళారులు లాభం గడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దళారీలపై దృష్టి సారించి రైతన్నలు ఆదుకోవాల్సి ఉంది. 

report
Adilabad
Cotton
Farmers
problems
Agents
Cotton Farmers

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు